Tuesday, November 19, 2024

Big story | ‘ఎగ్‌’ సైజు తగ్గింది.. అంగన్‌వాడీలకు గుడ్లు సరఫరాలో మాయ

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ అంగన్‌వాడీల ద్వారా విస్తృతమైన సేవలు అందిస్తోంది. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు బలమైన పౌష్టికాలను అందించాలన్న లక్ష్యంతో అంగన్‌వాడీల ద్వారా కోడిగుడ్లను పంపిణీ చేస్తోంది. పౌష్టికాహార పంపిణీలో భాగంగా వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటుంది. అయితే అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్న గుడ్లలో మాయాజాలం సాగుతోంది. గుడ్లు సరఫరాను చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ చిన్న పరిణామంలో సరఫరా చేస్తూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుడ్డు కనీస బరువు కచ్ఛితంగా 50 గ్రాముల పైనే ఉండాలి. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలకు సరఫరా అవుతున్న గుడ్లు 40 గ్రాముల బరువు లోపే ఉంటున్నాయి.

రాష్ట్రంలోని 257 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 55 వేల 607 అంగన్‌వాడీ కేంద్రాలకు బరువు తక్కువ గుడ్లే సరఫరా అవుతున్నాయి. అన్ని జిల్లాల్లో ఇదే విధమైన ఫిర్యాదులు లబ్ధిదారుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకున్న లబ్ధిదారులకు నెలకు 25 గుడ్లు ఇవ్వాల్సి ఉంది. బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు వారంలో ఆరు రోజుల పాటు నిత్యం గుడ్డు అంగన్‌వాడీల ద్వారా అందించాలి. అంగన్‌వాడీల్లో ల బ్ధిదారులకు ప్రస్తుతం గుడ్లు సక్రమంగానే పంపిణీ అవుతున్నా పరిమాణం మాత్రం చాలా చిన్నగా ఉండటంతో లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. చాలా జిల్లాల్లో గుడ్డు బరువు 35 నుంచి 40 గ్రాముల లోపే ఉండటంతో ప్రభుత్వ ఆశయం ఏమాత్రం నెరవేరని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం 30 గుడ్ల ట్రే కనీస బరువు 1.50 కేజీలు ఉండాలి.

అయితే ప్రస్తుతం సరఫరా అవుతున్న ట్రేల బరువు 1.10 కేజీల నుంచి 1.20 కేజీల లోపే ఉంటున్నాయి. గతంలో గుడ్ల సరఫరాలో ఇదే విధమైన ఫిర్యాదులు లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున రావడంతో ఈ పరిస్థితిని ప్రభుత్వం చక్కదిద్దింది. అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా పెద్ద పరిణామంలో ఉన్న గుడ్ల సరఫరాకు చర్యలు తీసుకుంది. అయితే మళ్లిd ఇప్పుడు కాంట్రాక్టర్లు మొదటికొచ్చి చేతివాటాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గుడ్ల సరఫరాకు ప్రభుత్వం నెలకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది.

జిల్లాల వారీగా కాంట్రాక్టర్లకు క్రమం తప్పకుండా బిల్లుల చెల్లింపులు కూడా చేస్తోంది. నేషనల్‌ ఎగ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ నిర్దేశిత ధరలకనుగుణంగా చెల్లింపులు జరుపుతుంది. ప్రతి గుడ్డుకు దాదాపు రూ. 4 కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో గుడ్డు ధర కొండెక్కింది. దీన్ని అనువుగా చేసుకుని కాంట్రాక్టర్లు పెద్ద సైజు గుడ్లను బహిరంగ మార్కెట్‌కు తరలిస్తూ, నాణ్యతలేని చిన్న పరిణామంలో ఉన్న గుడ్లను అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో గుడ్డు ధర రూ. 5.60గా ఉండటంతో కాంట్రాక్టర్లు రూ. 3 కేటగిరీకి చెందిన గుడ్లను ఎంపిక చేసి సరఫరా చేస్తున్నట్లుగా అంగన్‌వాడీలు, లబ్ధిదారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

బహిరంగ మార్కెట్‌లో లభించే గుడ్ల బరువుకు అంగన్‌వాడీలకు సరఫరా అవుతున్న వాటికి భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో గుడ్డు బరువు 60 నుంచి 75 గ్రాముల వరకు ఉండగా అంగన్‌వాడీలకు సరఫరా అవుతున్న వాటి బరువు మాత్రం 40 గ్రాముల లోపే ఉండటం ఈ మాయాజాలాన్ని స్పష్టం చేస్తోంది. ఒక్కొక్క జిల్లాలో దాదాపు రూ. 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ప్రతి నెల గుడ్ల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇంత భారీ మొత్తంలో ప్రభుత్వం ఖర్చు చేస్తున్నప్పటికీ నాణ్యతలేని గుడ్లు సరఫరా కావడం శోచనీయం. ప్రతి జిల్లాలో ప్రతి నెల లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లు కొట్టేస్తున్నారు.

లోపించిన పర్యవేక్షణ..

గుడ్ల సరఫరాలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంలో అధికార యంత్రాంగం ఉదాసీనతను ప్రదర్శిస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే చిన్న పరిణామంలో గుడ్ల సరఫరా జరుగుతుందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల ట్రే బరువు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా లేకున్నా వర్కర్లు, కాంట్రాక్టర్ల నుంచి తీసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ట్రే బరువు 1.50 కేజీలు లేని పక్షంలో రిటర్న్‌ చేయాల్సి ఉన్నా ఆ పరిస్థితి లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గుడ్ల సరఫరా అంశంపై దృష్టి సారించాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement