హైదరాబాద్, ఆంధ్రప్రభ: రానున్న రోజుల్లో వైద్య, ఆరోగ్యశాఖలో వైద్యులు, వైద్య, వైద్యేతర సిబ్బంది కొరత అనేమాట వినపడకుండా అన్ని ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోరాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోయే 83వేల ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన 20వేల పోస్టులు ఉండనున్నాయి. తెలంగాణ వైద్య విద్య, తెలంగాణ వైద్య, విధాన పరిషత్, తెలంగాణ ప్రజారోగ్యశాఖల్లోని వివిధ విభాగాల్లో మొత్తం 20వేల దాకా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రానున్న మూడు నెలల్లో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసి ఉంచింది. మూడు వైద్య విభాగాల పరిధిలోని ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు 4వేలు ఉండగా, 2వేల దాకా వైద్యుల పోస్టులు బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండే జిల్లా ఏరియా ఆసుపత్రుల్లో 1500 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇక డీహెచ్ పరిధిలో 800 ఎంబీబీఎస్ వైద్యుల పోస్టులు భర్తీ చేయనున్నారు. డీఎంఈ, టీవీవీపీ, డీహెచ్ విభాగాల్లో పారామెడికల్ సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు, అడ్మినిస్ట్రేషన్… పలు పోస్టులన్ని కలిపి దాదాపు 3వేల దాకా ఖాళీగా ఉన్నాయి. మరోవైపు వైద్య, ఆరోగ్యశాఖలో భర్తీ కావాల్సిన పోస్టుల్లో ఎక్కువగా స్టాఫ్ నర్సుల పోస్టులే ఉన్నాయని నర్సింగ్ అసోసియేషన్ చెబుతోంది. ఖాళీగా తేల్చిన 20వేల పోస్టుల్లో దాదాపు 7వేల పోస్టులు నర్సులవేనంటున్నారు. బోధనాసుపత్రుల్లో 5వేలు, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్ల్ 700, డీహెచ్ పరిధిలో 1800 దాకా నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపిన మరుక్షణమే ఖాళీల భర్తీపై స్పష్టత వచ్చే అవకాశముందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జారీ చేసే నోటిఫికేషన్లలో వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ముందుగా కొత్త మెడికల్ కాలేజీలు, ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లోని ఖాళీల భర్తీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. ఈ తరహా పోస్టులు దాదాపు 3వేల దాకా ఉంటాయని చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..