Friday, November 22, 2024

యూఎస్‌ డ్రోన్ల కొనుగోలుకు రంగం రెడీ.. డ్రోన్ల కొనుగోలు ప్రతిపాదనకు డీఏసీ ఆమోదం

అమెరికా నుంచి ప్రెడేటర్‌ డ్రోన్లను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని రక్షణ సముపార్జన మండలి (డీఏసీ) గురువారం ఆమాెెదం తెలిపింది. ఈ కొనుగోలు ప్రతిపాదనను భద్రతపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం ఆమోదం తెలపాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రెడేటర్లుగా పిలిచే ఎంక్యూ-9బీ సీగార్డియన్‌ డ్రోన్లను అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న జనరల్‌ అటామిక్స్‌ కంపెనీ తయారు చేస్తోంది. సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో ప్రయాణించే ఈ డ్రోన్లు క్షిపణులను సంతరించుకుంటాయి. అత్యంత కచ్చితత్వంతో శత్రు లక్ష్యాలను ఛేదిస్తాయి.

తాలిబన్లు, ఐఎస్‌ఎస్‌ ఉగ్రమూకలపై జరిపిన యుద్ధంలో ప్రెడేటర్‌ డ్రోన్లను అమెరికా అత్యంత విజయవంతంగా వినియోగించింది. ఒక అమెరికా కంపెనీ నుంచి లీజుకు తీసుకున్న రెండు ప్రెడేటర్‌ డ్రోన్లను సాగర ప్రాంతంలో కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి ప్రస్తుతం భారత నావికా దళం వినియోగిస్తోంది. ఆ క్రమంలో కొనుగోలు ఒప్పందం కుదిరిన తర్వాత భారత్‌కు చేరుకునే డ్రోన్లలో 15 డ్రోన్లను నిఘా కార్యకలాపాలు చేపట్టానికి నావికా దళానికి అప్పగిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికన్‌ కంపెనీ నుంచి కొనుగోలు చేసే డ్రోన్లను త్రివిధ దళాలకు సరిసమానంగా పంచుతారని చెప్పాయి.

ప్రధాని నరేంద్ర మోడీ యూఎస్‌ పర్యటన ముంచుకొస్తున్న తరుణంలో ఒప్పందానికి అంగీకారం తెలపాల్సిందిగా భారత ప్రభుత్వంపై బీడెన్‌ సర్కారు ఒత్తిడి తీసుకువస్తున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒప్పందాన్ని ఖరారు చేయాల్సిందిగా అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌, పెంటగాన్‌, వైట్‌ హౌస్‌లు భారత్‌ను కోరాయని వెల్లడించాయి. ప్రధాని మోడీ జూన్‌ 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో డ్రోన్ల ఒప్పందం ఖరారు కానుంది. తొమ్మిదేళ్ళ క్రితం ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తొలిసారిగా అమెరికాలో పర్యటించనున్న మోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వైట్‌ హౌస్‌లో ఆతిథ్యమివ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement