Saturday, November 23, 2024

కుల వృత్తికి కొండంత బలం.. మళ్ళీ వచ్చింది గొర్రెల పండగ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : దాదాపు ఐదేళ్ళ క్రితం అన్ని పల్లెల్లో సంతరించుకున్న పండగ వాతావరణం దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మళ్ళీ ప్రారంభం కాబోతోంది. గొల్ల, కురుమలకు చేతినిండా పని కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలు మురుగుపరుచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే శుక్రవారం నుంచి రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించనున్నారు. అన్ని అసెంబ్లి నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా గొర్రెల పంపిణీకి జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో విడతలో లబ్ధి చేకూర్చేందుకు 3.50 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.

వీరికోసం మొత్తం 73.50 లక్షల గొర్రెల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. గొర్రెల సేకరణ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి గొర్రెల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు లబ్ధిదారులను అక్కడికే తీసుకెళ్లి వారికి నచ్చిన గొర్రెలు కొనుగోలు చేసి వాటికి బీమా ప్రక్రియ అక్కడే పూర్తి చేయించి జిల్లాకు తరలిస్తారు. గతంలో కొన్ని యూనిట్లను కొని రీసైక్లింగ్‌ చేశారని ఆరోపణలు రావడంతో ట్రాన్స్‌పోర్టు లారీలకు జీపీఎస్‌ ఏర్పాటు చేసి ప్రస్తుతం గొర్రెలను తరలించాలని నిర్ణయించారు. కొనుగోలు చేసిన గొర్రెలతోపాటు వాటికి సంబంధించిన లబ్ధిదారులను కూడా ఉంచి 30 సెకన్ల వీడియోను రికార్డు చేయాలని ఆదేశించారు.

మొదటి దశలో అర్హులైన గొల్ల కురుమ సంఘం సభ్యులకు 20 గొర్రెలు, ఒక్కో పొట్టేలుతో కూడిన 3.93 లక్షల గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా రెండో దశలో దాదాపు 3.50 లక్షల కుటు-ంబాలకు లబ్ధి చేకూరనుంది. దాదాపు మూడేళ్ల క్రితమే లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావడంతో వారి నుంచి వాటా డబ్బును డీడీల రూపంలో సేకరించి యూనిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతలో గొల్లకురుమలు 43,750 రూపాయల చొప్పున వాటా సొమ్ముకు డీడీలు కట్టారు. సుమారు ఆరు నెలల పాటు నిర్విరామంగా కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా మిగితా లబ్ధిదారుల నుంచి వాటా సొమ్ము వసూలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -

బలపడిన కులవృత్తి

బీసీ కులాలలోని గొల్ల కురుమలు గొర్రెల పెంపకం వృత్తిపై ఆధారపడి ఎదుగుబొదుగు లేని జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. వారిలో కొందరికి గొర్రెల పెంపకం వృత్తిని కొనసాగిస్తూ జీవిద్దామన్నా వాటిని కొనేందుకు ఆర్థిక స్థోమత లేక ఇతర పనులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లను ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా పథకాన్ని రూపొందించింది.

లబ్ధిదారుల జాబితాలు సిద్ధం

సభ్యుల ఎంపిక కోసం మండల రెవెన్యూ అధికారి, మండల అభివృద్ధి అధికారి, వెటర్నరీ అధికారి సభ్యులుగా ఉన్న కమిటీ-లు గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశాయి. లాటరీ ద్వారా వీరందరిని ఏ లిస్టు, బీ లిస్టుగా విభజించారు. జిల్లాల వారీగా ప్రతి గ్రామ పంచాయతీల్లో గొల్ల, కురుమలను ఇప్పటికే గుర్తించారు. ప్రాథమిక గొర్రెల పెంపక సహకార సంఘాలు ఈ ప్రక్రియలో కీలక భూమిక పోషించనున్నారు.

ఇరవై గొర్రెలు, ఒక పొట్టేలు

ఈ సంఘాల్లోని సభ్యులకు లక్షా 25 వేల రూపాయల యూనిట్‌ విలువతో 20 గొర్రెలు, ఒక పొట్టేలును ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇందుకోసం లబ్ధిదారులు తమ వాటాగా మొదటి విడతలో 31,500 రూపాయలు చెల్లించారు. ఆ మొత్తం రెండో విడతలో 43,750 రూపాయలుగా నిర్ణయించారు. లబ్ధిదారులుగా ఎంపికైన వారందరికీ నిర్ధేశిత మొత్తం చెల్లించాలని అధికారులు సూచించారు. ఆ జాబితాలో ఉన్న వారంతా వాటా సొమ్ము చెల్లించి గొర్రెల యూనిట్లను పొందేందుకు ఏర్పాట్లు జకచకా జరుగుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement