ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్ : సేఫ్ జోన్.. సహజ సిద్ధ దండకారణ్యం అయిన అబుజ్మడ్లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడిన 24 ఏళ్ల చరిత్రలోనే రికార్డు స్థాయిలో జరిగిన భీకర ఎన్ కౌంటర్లో మావోయిస్టులు కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయారు. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 40 మంది మావోయిస్టులు చనిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నట్టు భద్రతదళాలు అనుమానిస్తున్నాయి.
అయితే.. ఘటనా స్థలిలో ఇప్పటికి 31 మంది మృతదేహాలను భద్రత దళాలు స్వాధీనం చేసుకోగా.. ఇందులో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. 18 మంది పురుషులు ఉన్నారు. మృతుల్లో 16 మంది మావోయిస్టులపై ఇప్పటికే ప్రభుత్వం ₹1.30 కోట్ల రివార్డు ప్రకటించింది. ఇప్పటి దాకా గుర్తించిన మృతదేహాల వివరాలిలా ఉన్నాయి.
తూర్పు డివిజన్ కమిటీ సభ్యులు సురేష్ సలాం, మీనా మడ్కం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 6 వ కంపెనీ సభ్యులు అర్జున్, సుందర్, బుధ్రామ్, సుక్కు, సోహన్, బర్సూర్ ఫూలో, బసంతి, సొమ్మే, జమీలా అలియాస్ బుద్రి, మావోయిస్టు రాందర్, సుక్లూ అలియాస్ విజయ్, సోను కొర్రమ్గా గుర్తించారు. ఇంకా.. 15 మంది మావోయిస్టులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
2018 తర్వాత ఇదే అతిపెద్ద ఘటన..
ఎన్కౌంటర్ స్థలిలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ , స్పెషల్ కంపెనీ నంబర్ 6, ప్లాటూన్ 16 కి చెందిన మృతదేహాలుగా కనిపిస్తున్నాయని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్రాజ్ ధ్రువీకరించారు. ఒకే ఆపరేషన్‌లో అత్యధిక సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు.
ఇది కాంకేర్ జిల్లాలో అయిదు నెలల తర్వాత జరిగిన మరో భారీ ఎన్కౌంటర్ గా చెబుతున్నారు. వీరిలో 29 మంది సీనియర్ కేడర్ మావోయిస్టులు ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. 2018 తర్వాత అంటే.. సుమారు ఆరేళ్ల తర్వాత మావోయిస్టులపై జరిపిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదే. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులతోపాటు ఏవోబీ.. ఛత్తీస్‌గఢ్ , మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.
భారీగా ఆయుధాలు స్వాధీనం
ఈస్ట్ బస్తర్ డివిజన్లోని ఇంద్రావతి ఏరియా కమిటీ, పీఎల్ జీఏ కంపెనీ నంబర్. 06, ప్లాటూన్ 16 నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను భద్రతదళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒక ఏకే -47 రైఫిల్, ఒక సెల్ఫ్-లోడింగ్ రైఫిల్, ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక లైట్ మెషిన్ గన్, .303 రైఫిల్‌తో సహా భారీ ఆయుధాలు లభించాయి.
ఈ ఘటనలో మావోయిస్టులు ప్రయోగించిన అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్ (బీజీఎల్) ప్రభావంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్ రామచంద్ర యాదవ్ గాయపడ్డారు. వెంటనే అతడిని హెలికాప్టర్లో తరలించి రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు, అక్కడ అతడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పారు.
ఈ ఆపరేషన్ మావోయిస్టులకు మిస్టరీ
అబుజ్మడ్లోకి అడుగుపెట్టడంం అంటే.. ప్రాణాలను ఫణంగా పెట్టటమేనని ఇప్పటి వరకూ మావోయిస్టుల ఏరివేతలో భధ్రతదళాలు భావించేవి. అత్యంత క్లిష్టతర ప్రాంతాన్ని భద్రతదళాలు ఎలా గుర్తించాయి. ఎలా మావోయిస్టుల జాడను పసిగట్టాయి? ఈ అంశాలపైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
నెందూరు, తులతులి అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో.. ఆపరేషన్ కగార్ పేరుతో నారాయణపూర్, దంతేవాడ డీఆర్జీ , ఎస్టీఎఫ్ దళాలు అడవిలోకి బలగాలు ప్రవేశించాయి. ఐటీబీపీ, బీఎస్ఎఫ్ జత కలిశాయి. 1,500 మందితో ఆపరేషన్ ను మొదలు పెట్టారు. 12 కిలోమీటర్లు బైకులపై వెళ్లి.. 10 కిలోమీటర్లు ట్రెక్కింగ్ ద్వారా లక్ష్యానికి చేరారు. ఎదురుపడిన మావోలు, పోలీస్ బలగాల మధ్య భారీగా కాల్పులు చోటు చేసుకున్నాయి.
అక్కడికి చేరడం అంత ఈజీ కాదు..
ఈ భారీ ఎన్ కౌంటర్ ను కగర్ ఆపరేషన్ అని.. కాదు ఆపరేషన్ పిన్ సర్ అని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఔను నారాయణ పూర్, దంతేవాడ జిల్లాల మధ్య దండకారణ్యం మావోయిస్టులకు సురక్షిత ప్రాంతం. చుట్టూ కొండలు. మధ్యలో ఇంద్రావతి నది పరుగులు.
ఇక వాగులు, వంకలకు కొదవ లేదు. ఒక లక్ష్యానికి చేరాలంటే కాలినడకే దిక్కు. వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంత కుంభవృష్టిలో తమను వెతుక్కుంటూ భద్రతదళాలు వస్తాయని మావోయిస్టులు ఊహించలేదు. 10కిలోమీటర్లు చిత్తడి నేలలో జర్రున జారుతూ భద్రతదళాలు థులి థులీ, వంగనయ ప్రాంతానికి చేరుకోవటం మామూలు విషయం కాదు.
ఈ ఆపరేషన్ కు పునాది ఎలా పడిందంటే..
అబుజ్మద్లోని ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని థులిథులీ ప్రాంతంలో ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ నాయకుడు కమలేష్, నీతితో సహా పలువురు సీనియర్లు భేటీ అవుతున్నారని, పెద్ద దాడికి ప్లాన్ చేస్తున్నారని పోలీసులకు ఇంటిలిజెన్స్ రిపోర్టు అందింది. భద్రతా బలగాల అధికారులు అప్రమత్తం అయ్యారు.
భారీ వ్యూహం రచించారు. తొలుత సైనికులను ఎక్కడికి పంపాలో తెలియక గందరగోళం నెలకొంది. అందరూ అంగీకరించడంతో, అంతర్ జిల్లాల సమన్వయంతో ఈ ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించారు . వివిధ ప్రాంతాల నుంచి సీఆర్బీఎఫ్ దళాలను పంపాలని నిర్ణయించారు.
కానీ నక్సలైట్ల ఆచూకీ దొరకలేదు. అబుజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు గుమిగూడారని పోలీసులు, భద్రతా బలగాలకు ఈ సారి పక్కా సమాచారం అందింది. అందులో కొందరు అగ్రనేతలు కూడా ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
భారీ వర్షాల తర్వాత దాదాపు నాలుగు కొండల నడుమ.. అంత్యంత లోతు లోయలోని నదులు, వాగులు దాటుకుని థులిథులీ -నెందూరు గ్రామ అటవీప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ చేపట్టారు. మొదటి 15 నిమిషాల్లోనే ఏడుగురు నక్సలైట్లను భద్రతదళాలు మట్టుబెట్టాయి.