హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ పార్టీ పూర్తి ఫోకస్ పెట్టింది. దీనికి తగ్గట్లే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మోడీ పాల్గొననున్నారు. ఈనెల 11, 12తేదీల్లో వైజాగ్‌లో శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 12వ తేదీన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు తెలంగాణకు వస్తున్నారు. ఈమేరకు ప్రధాని షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి తెలంగాణకు మోడీ రానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కి మోడీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.40 నుంచి 2 గంటల వరకు బేగంపేట్ ఎయిర్‌పోర్టులో స్వాగత సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభ ద్వారా బీజేపీ శ్రేణులను ఉద్ధేశించి మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. 2.15 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి రామగుండానికి ప్రధాని బయలుదేరనున్నారు.
మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్ కర్మాగారాన్ని సందర్శించనున్నారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం సాయంత్రం 4.15 నుంచి 5.15 వరకు భారీ బహిరంగ సభలో జాతిని ఉద్ధేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. సభద్వారా ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన, ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు రామగుండం నుంచి హైదరాబాద్‌కు ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు. 6.40కి బేగంపేట నుంచి ఢిల్లిdకి ప్రధాని వెళ్లనున్నారు.
నిరసనల సెగ…
రేపు (శనివారం) ప్రధాని రాక సందర్భంగా రామగుండలో అధికారులు, బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సభను సక్సెస్ చేసేందుకు రాష్ట్ర నాయకత్వం తలమునకలైంది. మరోవైపు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కోసం ప్రధాని పర్యటనను టీఆర్‌ఎస్, కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే మోడీ పర్యటనను నిరసనగా సింగరేణి కార్మికులు సైతం ఆందోళన నిర్వహిస్తున్నారు. “మోడీ గో బ్యాక్” అంటూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు ఇవ్వాల రేపు సింగరేణిలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రిలో బొగ్గు ఘనుల ప్రైవేటీకరణపై కార్మికులు ఆందోళన బాట పట్టనున్నారు. ఇంకోవైపు మోడీ పర్యటన సందర్భంగా నిరసన తెలపాలని తెలంగాణ యూనివర్సిటీస్ జేఏసీ తీర్మానించింది. శనివారం రోజు అన్ని వర్సిటీల్లో నల్లజెండాలతో ఆందోళన చేపట్టనున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
జల్లెడ పట్టిన వాయుసేన…
మోడీ పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కట్టుదిట్టమైన బధ్రతను పెంచుతున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆధ్వర్యంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రాంతాన్ని తమ ఆధీనం చేసుకోగా స్థానిక మున్సిపల్ అధికారులు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. వాయుసేన అధికారులు రామగుండం ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్లాంట్, ఎన్టీపీసీ, సింగరేణి, ఓసీపీలు గోదావరి తీర ప్రాంతంతో పాటు హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ప్రధాని మోడీని తీసుకెళ్లే మార్గాలను క్షణ్ణంగా పరిశీలించారు. మూడు హెలికాఫ్టర్లతో అధికారులు ఏరియల్ సర్వే నిర్వహించారు.