న్యూఢిల్లి:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ఏడవ పే కమిషన్ సూచనలు మేరకు కరువు భత్యం (డీఏ) 4 శాతం మేర పెరగబోతోందని, స్థూలంగా మూలవేతనంలో డీఏ 38 శాతానికి చేరుకుంటుందని, ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల భారీగా జీతాలు పెరుగుతాయని తెలుస్తోంది. అత్యున్నత వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ మీడియాలో వస్తున్న కథనాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. సాధారణంగా జనవరి, జులై నెలల్లో కరవుభత్యం పెంపుపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా ఈనెలలో డీఏ పెంపు ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ద ఆలిండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) మే నెల గణాంకాలు కూడా డీఏ పెంపును సూచిస్తున్నాయి.
కరువుభత్యాన్ని పెంచాలావద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఏఐసీపీఐ ని ప్రామాణికంగా తీసుకుంటారు. జూన్లో ద్రవ్యల్బణం 7.01గా ఉంది. సాధారణంగా ఆర్బీఐ పేర్కొనే ప్రామాణిక గణాంకం 2-6కన్నా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల డీఏ కూడా భారీగానే పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత మార్చిలో 3 శాతం డీఏ పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. జనవరి 1నుంచి వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. దాంతో డీఏ మూలవేతనంలో 34 శాతానికి పెరిగింది. ఇప్పుడు మరో 4 శాతం డీఏ పెరిగే సూచనలున్నాయి. దేశం మొత్తమ్మీద 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలమంది పెన్షనర్లు దీనవల్ల లబ్ధిపొందనున్నారు. ఇక్కడ మరో తీపి కబురు కూడా చెప్పాలి. గతంలో పెండింగ్లో ఉంచిన డీఏ-డీఆర్ పాత బకాయిలను కూడా చెల్లించబోతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.