న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో దొరల పాలనపోయి ప్రజాపాలన రావాలని, అందుకోసమే ప్రజాపార్టీని ఏర్పాటు చేస్తున్నామని ప్రముఖ ప్రజాగాయకులు గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) అన్నారు. బుధవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో కొత్త పార్టీ (ది గద్దర్ ప్రజా పార్టీ) నమోదు కోసం దరఖాస్తు అందజేసిన అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేళ్లు అవుతున్న సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయని, కానీ తెలంగాణ ప్రజలు కోరుకున్నది జరగడం లేదని అన్నారు. వేల మంది అమరవీరుల కారణంగా తెలంగాణ వచ్చిందని గుర్తుచేస్తూ దొరల రాజ్యం వద్దని తెలంగాణ ప్రజలు పోరాడారన్నారు.
తెలంగాణలో ప్రజా పాలన సాగడం లేదని, కనీసం జీవించే హక్కు కూడా తెలంగాణ ప్రజలకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దొరల పాలన పోయి ప్రజాపాలన నెలకొల్పడం కోసమే తాను ప్రజాపార్టీని స్థాపిస్తున్నానని గద్దర్ వెల్లడించారు. పాలన రాజ్యాంగం ప్రకారం సాగాలని, జీవించే హక్కు సహా ఐదు అంశాల ఆధారంగా తాను ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నానని వివరించారు. ప్రజా తెలంగాణ కోసం ప్రజల దగ్గరికి వెళుతున్నానని, ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి పార్టీ నిర్మాణం చేస్తానని చెప్పారు. ప్రజల జెండా, ఎజెండాయే తమ పార్టీ జెండా, ఎజెండా అని వ్యాఖ్యానించారు.
ప్రలోభాల నుంచి ‘ఓటు’ను రక్షించడమే తన లక్ష్యమని గద్దర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో భావసారూప్యత కల్గిన వ్యక్తులతో కలిసి ఒక విధానం, పద్ధతి ప్రకారం ముందుకు అడుగు వేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పిన గద్దర్, తన పార్టీ ఎవరితో కలిసి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అనేది కూడా ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ పుచ్చిపోయిన తెలంగాణాలా తయారైందని మండిపడ్డారు. కేసీఆర్ అమలు చేస్తున్న అనేక విధానాలు తప్పులుతడకగా ఉన్నాయని విమర్శించారు. తన వెనుక కోట్ల మంది ప్రజలున్నారని, వాళ్లే తన బలం, తన శక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. గద్దర్ వెంట ఆ పార్టీ నేషనల్ మీడియా కోఆర్డినేటర్ ఎ. రాజేశ్ తదితరులు ఉన్నారు.