Saturday, November 23, 2024

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేం : మంత్రి హరీశ్ రావు

ఆందోల్‌: తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని, జ‌ర్న‌లిస్టులంద‌రికీ సీఎం కేసీఆర్ అండ‌గా ఉంటార‌ని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఆందోల్‌ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి మంత్రి హరీశ్‌ రావు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజ హితంకోసం కృషిచేసే వృత్తి జర్నలిజమని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 12 వేల అక్రిడేటెడ్‌ జర్నలిస్టులు ఉంటే, తెలంగాణలో 21,295 అక్రిడేషన్లు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు ఇచ్చారని తెలిపారు. రూ.15 కోట్లతో మీడియా భవన్ నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. ప్రజలకు వాస్తవాలను చెప్పే బాధ్యత జర్నలిస్టులదేనని వెల్లడించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చొరవతో నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నదని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం సంతోషంగా ఉందని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జర్నలిస్టులకు కష్టసుఖాల్లో సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని చెప్పారు. మీడియా భవన్ కట్టించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 వేల అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్‌ రావు చొరవతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యమైందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement