న్యూఢిల్లి : నిరుపేదపై మళ్లి గ్యాస్ బాదుడుకు కంపెనీలు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే భారీగా పెరిగిన గ్యాస్ ధరలతో సతమతం అవుతున్న ప్రజలు.. మళ్లి పెంపుతో మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో వంట గ్యాస్‌పై కనీసం రూ.50 పెంచే ఆలోచనలో ఆయిల్ రంగ కంపెనీలు ఉన్నట్టు తెలుస్తున్నది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికే ఆయిల్ అండ్ గ్యాస్ సరఫరా కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తున్నది. డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లు ఈ మధ్య కాలంలో భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అంతకుముందు ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.50 మేర ఆయిల్ కంపెనీలు భారాన్ని మోపాయి. కిందటి వారం కూడా స్వల్పంగా వాటి ధరలను సవరించాయి. రూ.3.50 పైసలు మేర పెంచాయి. తాజా పెరుగుదలతో దేశ రాజధానిలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1003కు చేరుకుంది. బెంగళూరులో రూ.1005, చెన్నైలో రూ.1018.50, కోల్‌కతాలో రూ.1029, హైదరాబాద్‌లో రూ.1055గా ఉంది.
ఇప్పటికే కమర్షియల్‌పై బాదుడు..
గత సంవత్సరం చమురు సంస్థలు ఎల్‌పీజీ కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్‌పై భారీగా భారాన్ని మోపిన విషయం తెలిసిందే. రూ.205 వరకు ఒక్కో సిలిండర్‌పై భారం మోపాయి. అప్పట్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెంచలేదు. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల రేట్లను రెండు సార్లు పెంచాయి. ఫలితంగా దాదాపు అన్ని నగరాల్లోనూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2000 దాటేసింది. డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రూ.200 రాయితీ ప్రకటించినప్పటికీ.. అది కేవలం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోందనే విషయం తెలిసిందే. దీపం పథకం కింద మంజూరైన కనెక్షన్లకు మాత్రమే ఈ సబ్సిడీ లభిస్తున్నది. సాధారణ గృహ అవసర వంట గ్యాస్ కనెక్షన్ల ధరలు మాత్రం అలాగే ఉన్నాయి. జూన్ 1 లేదా మధ్య నెలలో మరోసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచే ఆలోచనలో ఆయిల్ రంగ కంపెనీలు ఉన్నట్టు తెలుస్తున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..