న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వైద్య రంగం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని, తాము సాంకేతిక, ఆర్థిక సాయం మాత్రమే చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీలను భర్తీ చేశారా? అని శుక్రవారం లోక్‌సభలో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబళించిన వేళ వైద్యం రంగంపై కేంద్రం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందక పేద ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పీహెచ్‌సీలో ఖాళీలు భర్తీ చేస్తే అట్టడుగున ఉన్న ప్రజానీకానికి వైద్యం అందుతుందని ఎంపీ నామా సూచించారు. ఆయన ప్రశ్నలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లిఖితపూర్వకంగా బదులిచ్చారు. వైద్య రంగం రాష్ట్రాల పరిధిలోని విషయమని, తాము నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేవలం సాంకేతిక, ఆర్థిక సాయం మాత్రమే చేస్తామని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..