గుంటూరు ప్రభన్యూస్ బ్యూరో: సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాలు అద్దె భారం మోయలేక మూత పడుతున్నాయి. భవన యజమానులకు అద్దెలు చేల్లించకపోవడంతో తాళాలు వేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైతులకు అందాల్సిన సేవలు సకాలములో అందక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట అట్టహాసంగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించింది. కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాల్లో ఈ కేంద్రాలను కొనసాగిస్తుండగా మరికొన్నిచోట్ల అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1080 ఆర్‌బీకేలు ఉండగా, అందులో 655 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ అద్దె భవనాలకు ప్రభుత్వం అద్దె నగదు చెల్లించకపోవడంతో సమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయి.
ఇప్పటివరకు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో సుమారు రూ.5.5 కోట్లు విడుదల కావాల్సి ఉందని అధికారులే తెలియజేస్తున్నారు. గుంటూరు జిల్లాలో మొత్తం 249 ఆర్‌బీకేలు ఉండగా అందులో 155 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటికి సంబంధించి రూ.90 లక్షలు విడుదల కావలసి ఉంది. పల్నాడు జిల్లాలో మొత్తం 421 ఆర్‌బీకేలు ఉండగా అందులో 214 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటికి రూ.2.47 కోట్లు విడుదలవ్వాలి. బాపట్ల జిల్లాలో మొత్తం 410 ఆర్‌బీకేల ఉన్నాయి. వీటిలో అద్దె భవనాల్లో ఉన్నవి 286. వీటికి సంబంధించి రూ.2.10 కోట్లు బకాయిలు విడుదల కావాలసి ఉంది. అంటే మొత్తం రూ.5.47 కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి రావలసిఉంది.
తాళాలు వేస్తున్న యజమానులు
గ్రామాల్లో రైతులకు ఏదో మేలు జరుగుతుందని అడిగిందే తడవుగా భవనాలను అద్దెకు ఇచ్చారు. రానురాను అద్దె బకాయిలు పేరుకుపోతుండడంతో ఉమ్మడి జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో యజమానులు ఆర్‌బీకే భవనాలకు తాళాలు వేస్తున్నారు. అలా తాళాలు పడిన వెంటనే ఉన్నతాధికారులు రంగంలోకి దిగుతున్నారు. వెంటనే తాళాలు తీయించాలని వ్యవసాయ శాఖ జేడీలను ఆదేశిస్తున్నారు. దీంతో జేడీలు.. యజమానితో చర్చించి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ కిందిస్థాయి అధికారులకు పురమాయిస్తున్నారు. గత్యంతరం లేక ఏడీలు, ఏవోలు యజమానులను బతిమిలాడి తాళాలు తీయిస్తున్నారు. తమ సొంత డబ్బు చెల్లించి తాళాలు తీయించిన ఘటనలు కూడా ఉన్నాయి.
గుంటూరు జిల్లాలోని ఒక మండల కేంద్రంలో ఆర్‌బీకేకు యజమాని తాళం వేశారు. పై అధికారులు మండల వ్యవసాయ అధికారిని. వెంటనే తాళాలు తీయించాలని, లేదంటే ఎమ్మెల్యే నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించటంతో ఏవో తన సొంతడబ్బు చెల్లించి తాళాలు తీయించారు.గుంటూరులో వ్యవసాయ శాఖ కమిషన్ వైస్‌చైర్మన్ నాగిరెడ్డి నిర్వహించిన సమీక్షలో అద్దె బకాయిల అంశం చర్చకు వచ్చింది. తాము యజమానులతో సమాధానం చెప్పలేకపోతున్నట్లు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల అంశాన్ని తాను ప్రభుత్వం దృష్టికి తెస్తానని నాగిరెడ్డి వారిని సముదాయించారు.