నాగార్జునసాగర్ (నందికొండ), ప్రభన్యూస్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు ఏపీ అధికారులు తక్షణమే నీటి విడుదల నిలిపివేయాలని ప్రాజెక్టు తెలంగాణ అధికారులు గురువారం ఏపీ అధికారులకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. గత ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కుడి కాలువ ద్వారా 184.692 టీ-ఎంసీ నీటిని సాగు తాగునీటి అవసరాల కోసం ఏపీ వాడుకోవడం జరిగిందని సాగర్ ప్రాజెక్ట్ ఈఈ మల్లికార్జున్ లేఖలో పేర్కొన్నారు. కృష్ణా బోర్డు కేటాయించిన 132 టీఎంసీల కంటే ఏపీ అదనంగా 52.692 టీఎంసీల నీటిని వాడుకున్నందున తక్షణమే కుడికాలువకు నీటి విడుదల ఆపాలని తెలంగాణ కోరుతోందన్నారు.
ప్రస్తుతం రిజర్వాయర్లో నీటిమట్టం క్రమంగా తగ్గిపోతున్నందున రానున్న వేసవి, భవిష్యత్తులో ఉమ్మడి రాష్ట్ర ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మార్చి 6వ తేదీన పైఅధికారుల ఆదేశాల మేరకు కుడి కాలువ పవర్ హౌస్‌కి వెళ్లి నీటిని ఆపాలని ఏపీ అధికారులతో చర్చించామన్నారు. కానీ గత మూడు రోజుల క్రితం మీడియాకు ఏపీ సాగర్ ఈఈ శ్రీహరి తెలంగాణ అధికారులు వారిపై దౌర్జన్యానికి పాల్పడినట్లు చెప్పారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా మల్లికార్జున్ తెలిపారు. కృష్ణా బోర్డు ఈనెల 15 నుండి సాగర్ కుడి కాలువ నీటి విడుదలను ఆపాలని ఏపీ అధికారాలను ఆదేశించిందని, ఈ మేరకు ఏపీ అధికారులు నీటి విడుదల ఆపాలని తాము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.