Friday, November 22, 2024

రవాణా శాఖకు రికార్డు స్థాయి ఆదాయం.. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే 2309 కోట్లు అధికం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర రవాణా శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆదాయం సముపార్జించింది. ఈ ఏడాది ఇప్పటికే రూ.6055 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇది గత ఏడాదితో పోలిస్తే రూ.2309 కోట్లు అధికం. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియనున్న దృష్ట్యా మొత్తంగా రూ.6285 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు శనివారం రవాణా శాఖ మంత్రి అజయ్‌ కుమార్‌ ఆ శాఖ ఉన్నతాధికారులు కె.శ్రీనివాస రాజు, జ్యోతి బుద్ద ప్రకాశ్‌తో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది అదనంగా రూ.2314 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉన్నందున మంత్రి రవాణా శాఖ అధికారులను అభినందించారు.

- Advertisement -

తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1.53 కోట్లు ఉండగా, డ్రైవర్ల లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్‌, పర్మిట్ల జారీ, పన్ను వసూళ్లు, వాహనాల ఉల్లంఘన అమలు నుంచి రెవెన్యూ వసూళ్లలో రవాణా శాఖ కీలక పాత్ర పోషిస్తున్నది. కాగా, ఇటీవల రవాణా శాఖకు పన్నులు కట్టకుండా తిరుగుతున్న వారిని రవాణా శాఖ అధికారులు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా 21347 వాహనాలను తనిఖీ చేసి తద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.54.21 కోట్ల పన్నులు, జరిమానా విధించడం జరిగింది. అలాగే, వాహనదారుల నుంచి ఇతర జరిమానాల రూపంలో రూ.9.37 కోట్లు మొత్తం కలిపి రూ.63.58 కోట్లు రవాణా శాఖకు ఆదాయం సమకూరింది. ఇదే స్ఫూర్తితో పని చేసి రవాణా శాఖ ఆదాయాన్ని మరింత పెంపొందించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి అజయ్‌ రవాణా శాఖ అధికారులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement