Tuesday, November 26, 2024

ఇండియా కంటే దుబాయిలోనే ఐఫోన్‌ రేటు తక్కువే..

మన దేశంలో ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లు ఈ నెల 22 నుంచి కస్టమర్లకు కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఆర్డర్లు బుకింగ్‌ జరుగుతోంది. మన దేశంలో తయారైన ఐఫోన్‌ 15తో పాటు 15లో ఇతర మోడల్స్‌ రేటు కూడా మన దేశం కంటే అమెరికా, సింగపూర్‌, దుబాయ్‌ వంటి దేశాల్లో తక్కువ రేటుకే కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఐఫోన్‌ 15 ప్రో మన దేశంలో 1,34,900 రూపాయలకు లభించనుంది.

అదే ఫోన్‌ దుబాయ్‌లో 97,069 రూపాయలకు, సింగపూర్‌లో ,000351 రూపాయలకు, అమెరికాలో 82,853 రూపాయలకు లభించనుంది. ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌ మన దేశంలో 1,59,900 రూపాయలకు లభించనుంది. అదే ఫోన్‌ దుబాయ్‌లో 1,15,133 రూపాయలకు, సింగపూర్‌లో 1,21,650 రూపాయలకు, అమెరికాలో 99,411 రూపాయలకు లభించనుంది.

ఐఫోన్‌ ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ను ఇండియాలో కొనేబదులు, విమానంలో దుబాయ్‌ వెళ్లి అక్కడ కొనుగోలు చేస్తే, మీకు విమాన ఛార్జీలు పోనూ ఇంకా 24వేలకు పైగా లాభం ఉంటుందని టెక్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇండియన్స్‌కు దుబాయ్‌లో వీసా ఆన్‌ ఎరివల్‌ సదుపాయం ఉంది. దుబాయ్‌కు రానుపోనూ విమాన ఛార్జీలు ఎక్కువలో ఎక్కువ 20వేల వరకు ఉంటాయని వీరు చెబుతున్నారు.

ఐఫోన్‌ 15ప్రో మ్యాక్స్‌ ఫోను దుబాయ్‌లో 1,15,133 రూపాయలకే లభిస్తుంది. అక్కడ స్థానికంగా ఏదైనా డిస్కౌంట్‌ లభిస్తే ఇది ఇంకా తగ్గుతుంది. ఒక రాత్రి దుబాయ్‌లో ఉన్నప్పటికీ మీకు ఈ డీల్‌లో ఇంకా లాభమే ఉంటుందని వివరిస్తున్నారు. యాపిల్‌ కంపెనీ తాను విక్రయిస్తున్న ఐఫోన్లను ఎక్కడ కొనుగోలు చేసినా గ్లోబల్‌ వారంటీ ఉన్నందున ఎలాంటి ఇబ్బందిలేదు. యాపిల్‌ ఐఫోన్‌ 15, 15 ప్లస్‌ మోడల్స్‌ ఇండియాలో కూడా తయారువుతున్నాయి.

- Advertisement -

వీటి రేట్లలో పెద్దగా తేడా లేదు. కాని ప్రో, మ్యాక్స్‌ మోడల్స్‌ను మన దేశంలో విక్రయించేందుకు చైనా, వియత్నాం నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దిగుమతి చేసుకునే ఫోన్లపై మన దేశంలో జీఎస్టీతో పాటు అదనంగా 22 శాతం సుంకాలు విధిస్తున్నారు. దీని ఫలితంగా ఐఫోన్‌ ప్రో, మ్యాక్స్‌ ధరలు దుబాయ్‌తో, అమెరికాలతో పోల్చితే 45 వేల వరకు తేడా ఉన్నాయి. మన దేశంలో అన్ని రకాల ఐఫోన్లు భవిష్యత్‌లో తయారు చేసినప్పటికీ, ఈ రేట్లలో పెద్దగా మార్పు రాదని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement