Saturday, November 23, 2024

మరో మూడు రోజులు దంచికొట్టనున్న వానలు.. అప్ర‌మ‌త్తం అయిన ప్ర‌భుత్వం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాల ముప్పు పొంచిఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. శనివారం ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారంనాటికి ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతంలో సగటు సమద్ర మట్టంనుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశవైపు వంపు తిరిగి ఉందని అధికారులు చెప్పారు. శనివారం బలంగా ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి ఆదివారంనాటికి బలహీనపడినట్లు వాతావరణ వాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌, కుమురంభీం, అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల 28వరకు భారీనుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

గడచిన వారంపది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎక్కడ చూసినా వరద ఉధృతితో నివాసిత ప్రాంతాలు అల్లాడుతున్నాయి. వర్షాలు కొంత తెరిపినిచ్చినా ఇంకా పలు ప్రాంతాల్లో వరదల తీవ్రత తగ్గలేదు. శనివారం కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని నదులు, వాగులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. మళ్లిd వర్షాలు పడితే తీవ్ర ముప్పు తప్పేలా లేదని భావించిన ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని మోహరించింది. సెలవులను రద్దు చేసిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నది. భారీ వర్షాలు, వరదలకు నీట మునిగిన ఇండ్లు, కాలనీలు, నివాసిత ప్రాంతాలకు పునరావాస చర్యలు ఊపందుకున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పది జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ అమలులో ఉంది. ఆదిలాబాద్‌, అసిఫాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌ అర్భన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలు ఉండగా, మరో 12 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌, ఇంకో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ అమలులో ఉంది. ఆగష్టు మూడోవారం వరకు వర్షాలు ఉధృతంగా ఉన్నాయని తెలుస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తతతో ఉంది. సీఎస్‌ మొలుకొని ప్రభుత్వ యంత్రాంగమంతా విధుల్లోనే ఉన్నారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్లతో 24 గంటలు పనిచేసే కాల్‌సెంటర్‌తోపాటు, సచివాలయంలో కంట్రోల్‌రూమ్‌ పనిచేస్తోంది.

గడచిన 24 గంటల్లో నిర్మల్‌ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టువద్ద 45.2 మిల్లిమీటర్లు, జగిత్యాల వెల్గటూర్‌లో 42.4మిల్లిమీటర్లు, దిలావర్‌పూర్‌లో 41.8, ముదోల్‌లో 39.2, బోద్‌లో 34.4, బజార్‌హత్నూర్‌లో 33.2, బాల్కొండలో 32.2, అసిఫాబాద్‌లో 30.4, పెద్దపల్లిలో 30.2, సారంగపూర్‌లో 30.2, భీమినిలో 28.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టులకు చేరుతున్న వరద నీటిని అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఇన్‌ఫ్లోకు అనుగుణంగా పలు ప్రాజెక్టులనుంచి నీటిని కిందకు వదులుతున్నారు. కాగా ఆదివారంనాడు కూడా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నగరంలోని చింతల్‌, గాజులరామారం, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సూరారం, దుండిగల్‌, కాప్రా, ఎల్లారెడ్డి గూడ, కుషాయిగూడ, నాగారం, దమ్మాయిగూడలలో కూడా వర్షం కురిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement