Wednesday, December 11, 2024

Rains : వ‌రి పంట‌పై.. వ‌ర్షం దెబ్బ‌!.. తీవ్రంగా న‌ష్ట‌పోయిన రైతులు

  • వ‌రుస తుపానులు, ఎడ‌తెరిపి లేని వాన‌లు
  • ఇటు పకృతి ప్రకోపం.. అటు పొట్టదశలో పంట న‌ష్టం
  • చేతికొచ్చే ద‌శ‌లో దెబ్బ‌తిన్న వ‌రిచేలు
  • చేతికందిన గింజ‌ల‌పై ద‌ళారుల పెత్త‌నం
  • తేమ పేరిట వ్యాపారుల అదిరింపులు
  • కొనలేమంటూ మిల్లర్ల బెదిరింపులు
  • రైతన్న కష్టార్జితం బ్రోకర్లకు అర్పణం
  • అన్నదాతల‌కు మిగిలింది కన్నీరే

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్

దేశంలోనే మేటి ధాన్యాగారాల్లో ప్రముఖ స్థానంలోని ఆంధ్రప్రదేశ్‌లో వరి రైతల ప‌రిస్థితి వర్ణనాతీతం. ఖరీఫ్ సీజన్‌లో మరీ దారుణం. రైస్ బౌల్‌గా పేరొందిన ఏపీలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 85.47 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి లక్ష్యం. రెండేళ్ల కిందట వరి సాగు లక్ష్యం 36.67 లక్షల ఎకరాలు కాగా, ప్రస్తుతం 35.07లక్షల ఎకరాలకు తగ్గింది. కోస్తాలో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే అత్యధిక దిగుబడి వస్తుంది. దక్షిణ కోస్తాలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రబీలోనే వరి సాగు జరుగుతుంది. ఇక రాయలసీమ జిల్లాలు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తిండి గింజల కోసమే రైతులు వరి సాగు చేస్తారు. కాగా ఈసారి వరి పంట‌ను తుపానుల‌, వ‌ర‌ద‌లు పెద్ద ఎత్తున‌ దెబ్బ‌తీశాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వరి సాగు దిగుబ‌డి, మార్కెట్ తీరు పరిశీలిద్దాం.

ధాన్యాగారాల్లో దైన్యం

ఉత్తరాంధ్రాలో అత్యధికంగా వరి పంట వర్షాధారమే. ఈ మూడు జిల్లాల్లోనూ ఇటీవల పకృతి ప్రకోపాన్ని ఇక్కడి రైతులు పంటిబిగువున భరించారు. ఖరీఫ్ సీజన్‌లో శ్రీకాకుళం జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. 4.5 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. విజయనగరం జిల్లాలో 2.40 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. 3.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. అనకాపల్లి, మన్యం జిల్లాల్లో సాగు విస్తీర్ణం తక్కువే. ఇక్కడ 60 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఉత్తరాంధ్రా జిల్లాల్లో ప్రస్తుతం విశాఖ, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం మన్యం జిల్లాల్లో -70 శాతం కోతలు పూర్తికాగా, అనకాపల్లి జిల్లాలలో కేవలం 30 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. ఈ జిల్లాల్లో తుపాన్ ప్రభావం పెద్దగా కనిపించలేదు.

- Advertisement -

పంటంతా కల్లాల్లోనే..

పూర్వ‌పు తూర్పు గోదావరి జిల్లాల్లో 80 శాతం కోతలు పూర్తయ్యాయి. కల్లాల్లో లక్ష టన్నులకు పైగా ధాన్యం రాసులు పోసి ఉన్నాయి. కాకినాడ జిల్లా కాజులూరు, తాళ్లరేవు, కాకినాడ గ్రామీణంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కోనసీమలోనూ వరి కోతలు జోరుగా కొనసాగుతున్నాయి. పది రోజులుగా రైతులను గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోంది. గోనె సంచులు లేక పొలం గట్లు, పుంత రహదారులపై ధాన్యం ఆరబెడుతున్నారు. ఒకవేళ సంచులు సరఫరా చేసినా..అవి కన్నాలు పడి ఉంటున్నాయని.. వాటిలో రవాణా చేయడంతో నష్టపోతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. కోనసీమ జిల్లాలో 1. 90 లక్షల ఎకరాలకుగాను సుమారు 45 వేల ఎకారాల్లో పంట విరామం ప్రకటించారు.

మిగిలిన 1. 45 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 8 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటి రైతుల నుంచి 2.00 లక్షల టన్నుల ధాన్యాన్ని పభుత్వం కొనుగోలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితిని పరిశీలిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ లో 2.05 లక్షల ఎకరాలలో వరి సాగు చెయ్యగా సుమారు 4 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 1.45లక్షల ఎకరాలలో కోతలు పూర్తి చేశారు. సుమారు 2 లక్షల టన్నుల మాత్రమే మార్కెట్ కు తరలించారు. ఇంకా 60 వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తి కావాలి. సుమారు 2 లక్షల టన్నుల ధాన్యం వరి చేలు, కళ్లాల్లోనే ఉంది.

ఉమ్మడి కృష్ణాలో.. అన్నీ కష్టాలే

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 30-40 నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పోసి ఆరబెట్టుకుంటున్నారు. ఈ డెల్టా పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. కృష్ణాజిల్లాలో 3.74 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 85 వేల ఎకరాల్లో కోత కోశారు.1.90 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రాగా, ఇప్పటివరకు 1.55 లక్షల టన్నులు ధాన్యం మిల్లుకు చేరింది. ఈ జిల్లా నుంచి మొత్తం 6 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు జిల్లా పరిధిలో 1,84,190 ఎకరాలు, బాపట్ల జిల్లా పరిధిలో 3,79,997 ఎకరాలు, ప్రకాశం జిల్లా పరిధిలో 7,164 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 90 వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది 70 శాతం మంది రైతులు యంత్రాలతోనే కోత కోసి ధాన్యం అమ్మేస్తున్నారు. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రబీ సీజన్ లో సాగుకు సన్నద్ధం అవుతున్నారు. నారుమళ్లు పోస్తున్నారు.

తిండి గింజల కోసం.. అనంత కష్టాలు

రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులు కేవలం తిండి గింజల కోసమే వరి పంట సాగు చేస్తారు. ఖరీఫ్ సీజన్‌లో కడప జిల్లాలో సాధారణ సాగు లక్ష్యం 31,171 హెక్టార్లు కాగా 28,428 హెక్టార్లలో వరి పంట సాగైంది. ముఖ్యంగా పెన్నా, కుందూ నదుల పరీవాహక ప్రాంతాల్లో చాపాడు, ప్రొద్దుటూరు, చెన్నూరు, కడప, సిద్దవటం, ఒంటిమిట్ట, మైలవరం మండలాల పరిధిలోని బోర్లు, ఫిల్టర్ల కింద ముందస్తుగా వరి సాగు చేశారు. నెల రోజుల కిందటే కోతలు కోశారు. కేసీ కెనాల్ తోపాటు మిగతా పలు మండలాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరి సాగు చేశారు. ఆగస్టులో వేసిన పంట ప్రస్తుతం కోత దశకు చేరుకుంది. ఇక నంద్యాల జిల్లా పరిధిలో కర్నూలు సోనా (బీపీటీ 5204), నంద్యాల సోనా (ఎన్‌డీఎల్‌ఆర్‌ 7) తదితర రకాలు ఎక్కువగా సాగు చేశారు.

జిల్లాలో 70,069 మందికిపైగా రైతులు 1,56,339 ఎకరాల్లో వరి సాగు చేశారు. జిల్లాలో అత్యధికంగా బండి ఆత్మకూరు మండలంలో 24,914, శిరివెళ్ల 13,919, రుద్రవరం 13,769, అవుకు 11,305, నంద్యాల 10,542, గోస్పాడు 10,415, పాణ్యం 9,531, బనగానపల్లి 8,449, మహానంది 8,104, వెలుగోడు 7,504, ఆళ్లగడ్డ 6,668, ఆత్మకూరులో 5,544 ఎకరాల్లో వరి సాగైంది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర, ఎల్ ఎల్ సి, గాజులదిన్నె, గురు రాఘవేంద్ర , కేసీ కెనాల్ కింద వరి సాగు చేశారు. కర్నూలు జిల్లాలో ఖరీఫ్ లో సాధారణ సాగు 12775 హెక్టార్లు.. సాగైనా పంటలు 13511 హెక్టార్లు, 105.79 శాతం సాగయింది. దొడ్డబియ్యం ఇక్కడ చాలా తక్కువగా పండిస్తారు.. లేవీ సేకరణ ఉండదు.. ఇక అనంతపురం జిల్లా వ్యాప్తంగా 22 వేల హెక్టార్లలో వరి పంట‌ సాగుచేయగా, కేవలం 30 శాతం మంది రైతులు మాత్రమే పంటను ముందుగానే కోసి మార్కెట్ కు తరలించి వ‌ర్షాల‌నుంచి తప్పించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వరి సాగుచేసిన 70 శాతం మంది రైతులు కొందరు పంట నూర్పిడి చేసి ధాన్యం కుప్పపోసుకోగా, మరి కొందరు రైతులు కోతలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ 70 శాతం రైతులంతా వర్షాలతో అన్నివిధాలా నష్టపోయారు.

కష్టార్జితం దళారీలకు అర్పణం

రైతు పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ధ్యానం కల్లాల్లోకి దళారులు కాకుల్లా వాలిపోతున్నారు. అబ్బే గింజలో తేమ ఎక్కువ గా ఉంది .. కొనలేమంటూ వేషాలు దంచేస్తున్నాయి. ఆర్బీకేలో ఇక చెప్పనవసరం లేదు. అక్కడ డ్రయర్లు లేవు. మిల్లర్ల దగ్గర ఉంటే.. కల్లాలకు ఇవ్వరు. ప్రభుత్వ నిర్ణయించిన కనీస మద్దతు ధరకు కోత విధిస్తున్నారు. ఇటీవల బాపట్ల జిల్లా కొల్లూరులో రైతులు రాష్ర్ట మంత్రి కొలుసు పార్థసారథి ఎదుట తమ ఘోషను వినిపించిన వైనం ఇది. తుపానుల నుంచి పంటల్ని కాపాడుకుని, చేతికి వచ్చిన పంటను అమ్ముకోవటానికి నానా కష్టాలు పడుతున్నామని బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్బీకేలకు వెళ్తే మిల్లులు ఖాళీ లేవంటున్నారు. రేపల్లెకు వెళ్లండి అంటున్నారు. దూరభారాలతో ధాన్యం తీసుకువెళ్లలేక ఆర్బీకేల దగ్గరే పడిగాపులు పడుతుంటే… మిల్లుల నుంచి లారీ రావటం లేదు. బ్రోకర్లకు అమ్ముకోండని అధికారులే సలహాలు ఇస్తున్నారు. బ్రోకర్ దగ్గరకు వెళ్తే తేమ వంకతో ధాన్యం ధర తగ్గిస్తున్నారు. 10 కేజీల తరుగుతో కొంటామంటున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.1740లు ధర ప్రకటిస్తే మిల్లర్లు, దళారులు కలిసి రూ.1400లే ఇస్తామంటున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలకు తీసుకువెళ్లి ధాన్యం అమ్ముకోండని కృష్ణాజిల్లా అధికారులు ఇచ్చిన కొత్త సలహాతో రైతులు బేంబేలెత్తారు. ఈ స్థితిలో దిక్కులేక అందిన కాడకు తెగనమ్మి తన కష్టార్జితం ధాన్యం గింజల్ని దళారీ జోలెలో అన్నదాత అర్పణం చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement