అస్సాంలోని నాగోన్ జిల్లా కలియాబోర్ ప్రాంతంలోని సోనారీ టీ ఎస్టేట్ నుండి 55 కిలోల బరువున్న 14 అడుగుల పొడవైన బర్మా కొండచిలువను శుక్రవారం రక్షించారు. టీ తోట కార్మికులు పురుగుమందులు పిచికారీ చేస్తుండగా కాలువలో పాము కనిపించింది. భయాందోళనకు గురైన కార్మికులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. వారు వెంటనే ప్రముఖ జంతు రక్షకుడు సంజీబ్ దేకాతో ఘటనా స్థలానికి చేరుకుని అతిపెద్ద కొండచిలువను పట్టుకున్నారు.
టీ గార్డెన్ కార్మికులు ఒక కాలువలో పామును గుర్తించారని, పురుగుమందులు పిచికారీ చేస్తున్నప్పుడు వారికి ఆ పాము కనిపించినట్టు సంజీబ్ దేకా చెప్పారు. ఇది 55 కిలోల కంటే ఎక్కువ బరువు, 14 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉన్న బర్మా కొండచిలువగా పేర్కొన్నారు.. ఇది తన జీవితంలో చూసిన అతిపెద్ద పాముగా తెలిపారు.
అనంతరం అటవీశాఖ అధికారుల సమక్షంలో సమీపంలోని సిల్‌ఘాట్ కామాఖ్య రిజర్వ్ ఫారెస్ట్ లో పామును విడిచిపెట్టాడు సంజీబ్ దేకా. ప్రపంచంలో కనిపించే ఐదు అతిపెద్ద పాము జాతులలో బర్మీస్ పైథాన్ ఒకటి. ఇది దాదాపు 25 అడుగుల పొడవు పెరుగుతుంది. 137 కిలోల బరువు ఉంటుంది.