న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను పార్లమెంటులో ఆమోదించిన ప్రక్రియ సరిగా లేదంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సుప్రీంకోర్టులో ఈ విషయంపై దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన (పార్టీ ఇన్ పర్సన్) తన వాదనలు తానే స్వయంగా వినిపించారు. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఎదుట సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. విభజన చట్టాన్ని, ప్రక్రియను వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లు ఈ పిటిషన్‌తో ముడిపెట్టగా, అందులో పిటిషనర్లుగా ఉండవల్లి అరుణ్ కుమార్, గిడుగు రుద్రరాజు వంటి నేతలున్నారు. విచారణ సందర్భంగా ఉండవల్లి పార్టీ-ఇన్-పర్సన్‌గా హాజరై తన వాదనలు తానే వినిపించారు.
తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందని ఉండవల్లి అన్నారు. పార్లమెంటులో ఈ బిల్లు పాసైన సమయంలో సభలోనే ఉన్నానని, నిబంధనలు పాటించకుండా బిల్లును పాస్ చేశారని ఆరోపించారు. అసలు రాష్ట్ర విభజన కోసం అనుసరించిన విధానమేదీ సరిగా లేదని అన్నారు. పార్లమెంటులో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేశారని, విభజనను వ్యతిరేకించే ఎంపీలను బలవంతంగా బయటకు నెట్టేశారని తెలిపారు. బిల్లును పాస్ చేసే సందర్భంగా కొందరు డివిజన్ కావాలని పట్టుబట్టినా సరే, ఓటింగ్ జరపలేదని, మూజువాణి ఓటుతో బిల్లు పాసైనట్టుగా ప్రకటించారని చెప్పారు.
నిజానికి రూల్ బుక్ ప్రకారం ఎవరైనా డివిజన్ కోరితే బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా, తటస్థంగా ఎంతమంది ఉన్నారో లెక్కించాల్సి ఉంటుందని, కానీ అదేదీ చేయకుండానే బిల్లును పాస్ చేశారని ఉండవల్లి అన్నారు. బిల్లుపై చర్చలో భాగంగా 86 మంది సభ్యులు మైక్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడించగా, మిగతావారు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలు చెప్పారని, కానీ ఏ ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని, విభజన చట్టంలో వేటినీ ప్రస్తావించనేలేదని అన్నారు. పార్లమెంటు చరిత్రలో ఇలా గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు.
బిహార్, జార్ఖండ్ విభజన సమయంలో రాజకీయంగా ఏకాభిప్రాయం లేదని, అప్పుడు సంప్రదింపులు, చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు. ‘పూంచి కమిషన్’ సిఫార్సుల ప్రకారం రాష్ట్రాల విభజన చేపట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా నడచుకోవాలని, కానీ ఇక్కడ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జోక్యం చేసుకుంటూ ఎనిమిదేళ్ల నాటి కేసుతో ఇప్పుడు మారేదేమి లేదని అన్నారు. ఎవరి తరఫున వాదనలు వినిపిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించగా, తాను విభజనకు అనుకూలంగా వాదనలు వినిపిస్తున్నానని చెప్పారు.
ఆ వెంటనే ఉండవల్లి తన వాదన కొనసాగిస్తూ.. తాను విభజనకు వ్యతిరేకం అని ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు. అయితే విభజన కోసం అనుసరించిన ప్రక్రియలో నిబంధనలు పాటించకపోవడాన్నే తాను సవాల్ చేస్తున్నానని అన్నారు. మరో పిటిషన్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ విభజన జరిగి ఇప్పటికే 8 ఏళ్లు దాటిపోయిందని గుర్తుచేశారు. పిటిషన్‌పై విచారణ ఇంకా సాగదీయకుండా నిర్ణయం వెలువరించాలని అభ్యర్థించారు. తదుపరి వాయిదా నాడు ఈ పిటిషన్‌పై విచారణ ముగించాలా వద్దా అన్నది నిర్ణయిస్తామని తెలిపారు. కేసు తదుపరి విచారణ 2023 ఫిబ్రవరి 22కి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.