ఈటానగర్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్ నుంచి వర్చువల్‌గా నేడు ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ గ్యారంటీ ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. బీజేపీ ఘన విజయం సాధించనుందని దీంతో అర్థం అవుతోందని చెప్పారు.. తాను ఎన్నికల్లో విజయం కోసం పనిచేయనని, ప్రజల కోసమే పనిచేస్తానని అన్నారు..
70ఏళ్లలో చేయని అభివృద్ధిని పదేళ్లలో చేశా.
యూపీఏ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు.. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో రూ.55వేల కోట్ల పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.. 70ఏళ్ల యూపీఏ పాలనలో చేయని అభివృద్ధిని తాను పదేళ్లలోనే చేసి చూపించానని ప్రధాని అన్నారు… అష్ట లక్ష్మీ పథకం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని స్పష్టం చేశారు..
పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తా..
పర్యాటక రంగం విషయంలో దక్షిణాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో దృఢమైన సంబంధాలున్నాయని అంటూ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపు అనే అంశాన్ని కూడా మోదీ ఇక్కడ గుర్తుచేశారు.
ఏనుగుపై మోదీ సపారీ ..
అంతకుముందు ప్రధాని మోదీ.. అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏనుగుపై సఫారీ చేశారు. నేషనల్ పార్క్‌లో తిరుగుతూ కాసేపు అక్కడే సమయం గడిపారు.
సెలా టన్నెల్ చరిత్ర…
ఇది 13వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన రెండు లేన్ల సొరంగం.. దీని తయారీలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించారు. ఈ సొరంగం హిమపాతం వల్ల ప్రభావితం కాదు. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో వేగవంతమైన, మరింత సమర్థవంతమైన రవాణా మార్గాలను అందించడమే కాకుండా దేశానికి వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉన్న మార్గం ఇది… చైనాకు ఆనుకుని ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈ సొరంగం సైనికులు తవాంగ్ సెక్టార్‌లోని ఫార్వర్డ్ ప్రాంతాలకు త్వరగా చేరుకోవడంలో గేమ్ ఛేంజర్‌గా మారనుంది. ఈ సొరంగం LACపై భారత సైన్యం సామర్థ్యాలను పెంచుతుంది. ఇది భారత సైన్యం, ఆయుధాల కదలికను సులభతరం చేస్తుంది. అంతే కాకుండా భద్రతతో పాటు ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. దాదాపు రూ.825 కోట్లతో దీన్ని నిర్మించారు.
సెలా టన్నెల్ ప్రాజెక్ట్ రెండు సొరంగాలను కలిగి ఉంటుంది. మొదటి 980 మీటర్ల పొడవైన సొరంగం ఇది ఒకే ట్యూబ్ సొరంగం. రెండవ 1555 మీటర్ల పొడవైన సొరంగం ఇది ట్విన్ ట్యూబ్ టన్నెల్. ఇది 13000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగాలలో ఒకటి. ఇది కొత్త ఆస్ట్రియన్ టన్నెలింగ్ పద్ధతిని ఉపయోగించి నిర్మించారు. ఈ టన్నెల్ చైనా సరిహద్దుకు కేవలం 10 కిలో మీటర్లు దూరంలో ఉండటమే విశేషం. ఈ టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమింగ్- తవాంగ్ జిల్లాలను కలుపుతుంది. భారత్‌ను చైనా భూభాగంతో విభజించే వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కి చేరుకోవడానికి ఈ సొరంగమే ఏకైక మార్గం.