Tuesday, November 26, 2024

కొత్త నిబంధనతో పెరగనున్న ఈవీల ధరలు

ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ బ్యాటరీల పెలిపోయిన సంఘటనలు జరగడంతో కేంద్రం ఈ విషయంలో భద్రతా ప్రమాణాలపై కొత్త నిబంధనలు ప్రకటించింది. సెప్టెంబర్‌ 1న కేంద్ర రవాణా శాఖ కొత్త నిబంధనలతో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. టూవీలర్స్‌లో బ్యాటరీలు పేలకుండా అదనపు రక్షణ చర్యలు తీసుకోవాలని, ఇందుకు అనుగుణంగా మార్పులు చేయాలని కేంద్రం ఆదేశించింది. ముఖ్యంగా లిథియం ఆయాన్‌ బ్యాటరీల విషయంలో తగిన అదనపు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కొత్తత నిబంధనల వల్ల ఈవీ టూ వీలర్స్‌ ధరలు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, ఆన్‌ బోర్డు ఛార్జర్లు, బ్యాటరీ ప్యాక్‌ డిజైన్‌, సెల్స్‌ మధ్య షార్ట్‌ సర్క్యూట్‌ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వంటివి ఉన్నాయి. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ టూ వీలర్స్‌, త్రీ వీలర్స్‌, ఫోర్‌ వీలర్స్‌కు కూడా వర్తిస్తుంది. అయితే కార్లలో ఇప్పటికే అత్యాధునిక బ్యాటరీలను వాడుతున్నారు.
వరసగా టూ వీలర్స్‌ బ్యాటరీలు పేలిపోవడంతో కేంద్ర రోడ్డు రవాణా శాఖ దీనిపై ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

మన దేశంలో లిథియం ఆయాన్‌ బ్యాటరీలను ఒరిజినల్‌ మన్యూఫాక్చరర్‌ నుంచి దిగుమతి చేసుకుని కొన్ని కంపెనీలు సొంత ప్లాంట్స్‌లో అసెంబ్లింగ్‌ చేస్తున్నాయి. ఓలా, ఏథర్‌ ఎనర్జీ ఈ విధంగానే బ్యాటరీలను తయారు చేస్తున్నాయి. మరికొన్ని బ్యాటరీ తయారీ సంస్థలు దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నాయి. కేంద్రం తాజాగా జారీ చేసిన నిబంధనల వల్ల సొంత ఆర్‌ అండ్‌ డీ ఉన్న సంస్థలు, నాణ్యమైన బ్యాటరీలను తీసుకు వచ్చేందుకు అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను ఇప్పటికే అగ్రశ్రేణి సంస్థలు అమలు చేస్తున్నాయి. మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బ్యాటరీ పై అదనంగా 20 శాతం రేటు పెరుగుతుందని, వినియోగదారులపై 10 వేలకు పైగా అదనంగా భారం పడుతుంది. రక్షణకు సంబంధించినది కనుక ఇది తప్పదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆక్టోబర్‌ 1 వరకు తుది గడువు ఇవ్వడం వల్ల ఈ లోగా అన్ని ప్రమాణాల ప్రకారం బ్యాటరీలను పరీక్షించడం, అదనపు రక్షణల ఏర్పాటు చేయడం కొంచెం కష్టమైన అంశమని మరో టూ వీలర్‌ తయారు దారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల కొనుగోలుదారుల్లో నమ్మకం పెంచుతుందని, ఇది దీర్ఘకాలంలో అమ్మకాలు పెరగడానికి తోడ్పడుతుందని ఎక్స్‌కామ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనంత్‌ నహతా అభిప్రాయపడ్డారు.
వినియోగదారుల రక్షణే ఏ కంపెనీకైనా ముఖ్యమని, బ్యాటరీల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే వినియోగదారుల్లో విశ్వాసం నింపకలుగుతామని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement