Friday, November 22, 2024

టమాట ధర డమాల్‌.. నెల క్రితం వరకు వరకు కిలో రూ.40పైమాటే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నెలన్నర క్రితం వరకు టమాట కిలో రూ.50 పైమాటే. రైతు బజార్లు, కూరగాయాల మార్కెట్‌లో టమాట కనిపించేది కాదు. కనిపించినా సామాన్యుడు కొనలేని ధరలు. కాని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టమాట ధర డమాల్‌ అయిపోయింది. ఉంటే అతివృష్టి, లేకుంటే అనావృష్టి అన్నట్లుగా టమోటా సాగు చేసిన రైతుల పరిస్థితి మారిపోయింది. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే దిగుబడిరాక వచ్చినా సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో టమాట ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో రూ.5 నుంచి రూ.10లోపే పలుకుతున్నాయి. హోల్‌సేల్‌గా కిలోకు రైతులకు రూ.2మాత్రమే వ్యాపారులు చెల్లిస్తున్నారు.

ధరలు పడిపోవడంతో టమాట సాగు చేసిన రైతులకు పెట్టుబడి ఖర్చుతోపాటు రవాణా ఖర్చు కూడా గిట్టుబాటు కావడం లేదు. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మొదట వారం వరకు మార్కెట్‌లో కిలో టమాట రూ.30 నుంచి రూ.40దాకా ధర పలికేది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాట రూ.8కే అమ్ముడవుతోంది. దీంతో సాగు చేసిన రైతులకు కనీసం కూలీల ఖర్చు, రవాణా ఖర్చులు కూడా కలిసి రావడం లేదు. కాసుల వర్షం కురిపిస్తుందనుకున్న టమాట, ధర లేక దు:ఖాన్ని మిగులుస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక పంటను పొలల్లోనే వదిలేస్తున్నారు.

- Advertisement -

ప్రతి ఏటా టమాట రైతులకు కన్నీళ్లే మిగులుస్తోంది. మార్కెట్‌లో ధర ఉంటే పంట సరిగా పండడడం లేదు. ఇక పంట బాగా పండితే మార్కెట్‌లో ధర ఉండడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌కు భారీగా టమాటా వస్తోంది. హోల్‌సేల్‌గా కిలో రూ.2 నుంచి రూ.3వరకు ధర పలుకుతుండడంతో రైతులు టమాట చేలలో పశువులను మోపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టమాట సాగు చేసిన రైతుల పరిస్థితి ఇదే. అర ఎకరా టమాట సాగుకు ఎంత లేదన్నా రైతులకు రూ.25వేల దాకా పెట్టుబడి ఖర్చు అవుతోంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో దిగుబడి కూడా బాగానే వస్తోందని కాని మార్కెట్‌లో ధర లేకపోవడంతో పట్టణాలకు తీసుకొచ్చిన రైతులు… వాటిని అక్కడే రోడ్లపై వదిలేసి వెళుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 15 నుంచి 20వేల ఎకరాల్లో టమోటా పంట సాగవుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధికంగా టమాట సాగవుతోంది. పంట దిగుబడి చేతికి వచ్చిన సమయంలోనే టమాట ఆ ధరలు పడిపోయాయి. టమాటాలు తెంపి మార్కెట్‌కు తీసుకుపోతే వ్యాపారులు రూ.2 నుంచి రూ.3లోపే ఇస్తామని కరాఖండీగా చెబుతున్నారు. అయితే ధర తగ్గడంతో ప్రజలకు ఏమైనా లాభం కలుగుతుందా అంటే లేదనే చెప్పాలి. కేవలం మధ్యవర్తులు, ధళారులు మాత్రమే లాభాన్ని పొందుతున్నారు. రైతుల నుంచి రూ.3కు కిలో టమాటా కొని వినియోగదారులకు రూ.10 నుంచి రూ.15దాకా అమ్ముతున్నారు.

తెలంగాణకు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి కూడా భారీగా రాష్ట్ర మార్కెట్‌లోకి టమాట రావడంతో ధర పడిపోతోంది. స్థానిక వ్యాపారులు సమీపంలోని ఇతర రాష్ట్రాల మార్కెట్‌ల నుంచి టమాటను కారుచౌకగా కొనుగోలు చేసి రాష్ట్రానికి తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement