ఉల్లి రైతుతో పాటు వ్యాపారులపై కరోనా దెబ్బపడుతోంది.గతసంవత్సరం ఇదే నెలలో బెంబేలెత్తించిన ఉల్లి ధరలు ప్రస్తుతం తగ్గాయి. ధర తగ్గిందని వినియోగదారులు సంతోషిస్తున్నా.. పండించిన రైతులకు గిట్టుబాటు కాక, ప్రస్తుతం కొనేవారు లేక వ్యాపారులు విలవిల్లాడు తున్నారు పై గా ఉల్లి రైతులకు పండించిన పంటలకు కనీసం రవాణా ఖర్చు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు.ప్రస్తుతం తెలంగాణలో ఉల్లి గత సంవత్సరంలో పోలిస్తే ఈసారి దిగుబడి రెట్టింపుగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో పాటు ప్రధానహోల్సేల్ మార్కెట్ హైదరాబాద్ కు 70 నుంచి 80శాతం ఉల్లిగడ్డ మహారాష్ట్ర నుంచేసరఫరా అవుతోంది. ఒక పక్క రాష్ట్రంలో భారీగా ఉత్పత్తి, మహారాష్ట్ర, కర్నాటక నుంచి భారీగా ఉల్లిగడ్డ దిగుమతి అవుతుండడంతో ఉల్లి ధరలు పూర్తిగా పడిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రిటైల్ ధరల ప్రకారం 6 నుంచి 7కేజీల ఉల్లి రూ.100 పలుకుతోంది.
హోల్ సేల్ మార్కెట్లో అయితే కిలో 10 రూపాయలకు అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ఇంతగా ధరలు పడిపోలేదని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్ర, కర్నాటక నుంచి నగరానికి రోజుకు 120 నుంచి 180లారీల ఉల్లి దిగుమతి అవుతోంది. డిమాండ్ కంటే సప్లయ్ అధికంగా ఉండడం వల్లనే ధరలు పడిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లోనూ అమ్మకాలు బాగా పడి పోయినట్టు తెలుస్తోంది. కరోనా విజృంభణ కారణంగా మార్కెట్లకు వచ్చే వారి సంఖ్య బాగాపడిపోవడంతో బయటకు వచ్చి కొనుగోలు చేయకపోవడంతో చిన్న ట్రాలీలు, తోపుడు బండ్లపై కాలనీలు, బస్తీలకు వచ్చి అమ్ముతుండడంతో మార్కెట్ కు వచ్చి కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గిపోయింది.