ఖమ్మం బ్యూరో, ప్రభన్యూస్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కేంద్రంగా, రైతు లాభాలకు కేరాఫ్‌గా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సొంతం చేసుకుంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ రైతులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రాష్ట్ర స్థాయి ద్వితీయ అవార్డును ఇటీవలే మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం, అధికారులు జిల్లా మంత్రి పువ్వాడ అజ య్‌కుమార్ స్ఫూర్తితో మరింతగా సేవలు చేస్తూ పునీతమవుతోంది. పత్తిలో ఆల్‌టైం రికార్డు రేటును గత సీజన్లో సొంతం చేసుకున్న మార్కెట్ ప్రస్తుతం మిర్చి అమ్మకాల్లో కూడా ఆల్ టైం రికార్డు రేట్‌ను సొంతం చేసుకోవడం విశేషం. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చికి అత్యధిక రేటు క్వింటా రూ. 22,300కు చేరి ఆల్‌టైం రికార్డుగా మారింది. ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరం గ్రామానికి చెందిన చెన్నంనేని కృష్ణ అనే రైతుకు చెందిన మిర్చి పంటకు గరిష్ఠ ధర పలికింది.
ఉదయం జరిగిన జెండా పాటలో ఖరీదు దారులు రైతు పంటను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో క్వింటా మిర్చి గరిష్ఠ ధర 22,300లకు చేరింది. నాణ్యమైన పంటను మార్కెట్‌కు తెచ్చిన రైతును మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డౌలే లక్ష్మీప్రసన్న సాయికిరణ్ పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు. మిఠాయి తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. ఐదు జిల్లాల రైతులకు ఆదెరువుగా ఉన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంచి ధర రావడం సంతోషంగా ఉందన్నారు. సాగురైతులు నాణ్యమైన పంటలు దిగుబడి చేయడం ద్వారానే రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయన్నారు. జాతీయస్థాయిలో ఖమ్మం రైతుల పంటల రికార్డు స్థాయి రావడం ఆనందంగా ఉందన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో వారి ఆదేశాల మేరకు మార్కెట్లో పాలకవర్గం, అధికారులు పనిచేస్తున్నట్లు తెలిపారు. మంత్రి పువ్వాడ సారధ్యంలో మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ గ్రేడ్-2 సెక్రటరీ బి.బజార్, అసిస్టెంట్ సెక్రటరీలు నిర్మల, రాజేంద్ర ప్రసాద్, పలువురు వ్యాపారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.