Saturday, November 16, 2024

Big story | సన్న బియ్యం ధరల బెంబేలు.. క్వింటాల్‌కు రూ.1000దాకా పెరిగిన ధర

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ ఏడాది సన్న బియ్యం ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో సన్నరకం బియ్యం ధరలు క్వింటాకు కనీసం రూ.1000పైనే పెరిగాయి. రానున్న రెండు, మూడు నెలల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. నెల క్రితం వరకు బీపీటీ సన్న రకం ధాన్యం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలుముఖ్య నగరాల్లో రూ.3800 నుంచి రూ. 4300 మధ్యన ఉండేది. వాస్తవానికి ప్రతి ఏటా వర్షాకాలం సీజన్‌ తర్వాత బీపీటీ, ఇతర సన్నరకం బియ్యం ధరలు నిలకడగా ఉండడమో, లేకుంటే క్వింటాకు కనీసం రూ.500 మేర తగ్గడమే జరుగుతుండేవి. అయితే ఈసారి పరిస్తితి అందుకు భిన్నంగా ఉంది.

ఈ ఏడాది అక్టోబరు, నవంబరులో పంట దిగుబడి వచ్చినా ఆశించినంత రాకపోవడంతో ప్రస్తుతం మార్కెట్‌లో సన్న బియ్యం ధర భారీగా పెరిగిపోతోంది. హైదరాబాద్‌ నగరంలో 25 కిలోల బీపీటీ రకం బియ్యం బ్యాగ్‌ ధర గతేడాదితో పోల్చుకుంటే రూ.300 నుంచి రూ.350 మేర పెరిగింది. ఇక క్వింటాల్‌కు లెక్కేస్తే దాదాపు రూ.1200 నుంచి రూ.1400 మధ్యన ధర పెరిగిందని వినియోగదారులు వాపోతున్నారు. రానున్న రోజుల్లో క్వింటాల్‌ సన్న బియ్యం ధర రూ.5 వేలను తాకే అవకాశం ఉందని రైస్‌ డీలర్లు చెబుతున్నారు.

- Advertisement -

రాష్ట్రంలో ఎక్కువగా బీపీటీ సోనా మసూరి రకం బియ్యం వినియోగం ఎక్కువ. ఇటీవలి కాలంలో పేదలు మొదలు సామాన్య, ధనికుల వరకు బీపీటీ , హెచ్‌ఎంటీ, ఇతర రకాల సన్న బియ్యాన్నే ఆహారంగా తీసుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో సన్నరకం బియ్యానికి డిమాండ్‌ భారీగా ఉంది. అయితే ఈసారి ఖరీఫ్‌లో సాగైన సన్నరకం వరి దిగుబడి బాగా తగ్గింది. రాష్ట్రంలో ప్రతి ఖరీఫ్‌లో బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్‌, సోనామసూరి, హెచ్‌ఎంటీ, జై శ్రీరాం, శ్రీరామ, కావేరి, శ్రీ101 లాంటి సూపర్‌ ఫైన్‌ రకాలను రైతులు విరివిగా సాగు చేస్తుంటారు. ప్రతి ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రంలో సన్న రకం ధాన్యం విస్తృతంగా సాగవుతోంది. గడిచిన రెండేళ్లుగా సన్నాలకు మార్కెట్‌లో పెద్దగా ధర రాకపోవడం, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ దొడ్డు రకం ధాన్యాన్నే కొనుగోలు చేయడంతో రైతులు సన్నాల సాగుకు పెద్దగాఆసక్తి చూపడం లేదు.

దాంతో రాష్ట్రంలో ప్రతి ఖరీఫ్‌ సీజన్‌లో సాగయ్యే సన్నాల సాగు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. బియ్యంగా మార్చి స్థానిక మార్కెట్‌లో అమ్ముకుందామని భావించి, కుటుంబ అవసరాల కోసం ఈసారి ఖరీఫ్‌లో సాగు చేసిన సన్నాల సాగు కూడా ఆశించినంత దిగుబడి ఇవ్వలేదు. ఈ వర్షాకాలంలో భారీ వర్షాలకు జరిగిన నష్టంతోపాటు దోమకాటు, కాటుక తెగులు, కాండం తొలిచే పురుగు (తెల్ల తాలు కంకులు) తదితర వ్యాధులు వరికి సోకాయి. దీంతో గణనీయంగా 2022-23 ఖరీఫ్‌లో సన్నాల సన్నరకం ధాన్యం దిగుబడి బాగా తగ్గింది. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న మేర బియ్యం సరఫరా లేకపోవడంతో సన్నబియ్యం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. మరోవైపు ఏటికేడు పెరుగుతున్న దున్నకం ఖర్చులు, యూరియా తదితర కాంప్లెక్స్‌ ఎరువుల ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలోనూ సన్న బియ్యం ధర భారీగా పెరిగేందుకు కారణమవుతోంది. ఇది చాలదన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్డ్‌ రైస్‌ బ్యాగ్‌పై 5శాతం జీఎస్టీ పన్నును విధించడం కూడా బియ్యం ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement