Thursday, November 21, 2024

Big Story | ట్రిపుల్​ సెంచరీ దాటిన కోడి ధర.. 350కి కిలో చికెన్‌

అమరావతి, ఆంధ్రప్రభ : వేసవికి కోళ్లు విలవిలమంటున్నాయి. వడగాలులకు సొమ్మసిల్లిపోతున్నాయి. దీంతో చికెన్‌ ధర ఆల్‌-టైమ్‌ రికార్డు నమోదు చేసింది. పౌల్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధింగా హోల్‌సేల్‌ మార్కెట్‌లో బాయిలర్‌ చికెన్‌ కిలో రూ.350కు చేరింది. రోజు రోజుకూ ఎగబాకుతూ మాంసం ప్రియులు చేతి చమురు వదిలిస్తోంది. పెరుగుతున్న ధరలతో చికెన్‌ కొనాలంటే సామాన్యుడు కళ్లు తేలేయాల్సిన పరిస్థితి నెలకొంది. నెల క్రితం వరకూ రూ.200 లోపు ఉన్న చికెన్‌ ఒక్కసారిగా రూ.300 నుండి రూ.350 వరకూ అమ్మకాలు సాగుతున్నాయి.

పౌల్ట్రి నిర్వాహకులు కోళ్లను ఎండ వేడిమి, వడగాడ్పుల నుండి కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చికెన్‌తోపాటు కోడి గుడ్ల ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. గతంలో ఒక్క ట్రే ధర రూ.120 వరకూ ఉండగా ప్రస్తుతం అది రూ.150 వరకూ పెరిగింది. కొన్ని చోట్ల రూ.10 నుండి రూ.20 వరకూ ఒక్కో ట్రేకు అదనంగా తీసుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

అటు చికెన్‌ ధరలు పెరగడంతో మాంసాహార ప్రియులు కూడా తక్కువగానే తినాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కేజీ కొనుగోలుచేసే వినియోగదారుడు ఇప్పుడు అర కేజీ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా హోటల్స్‌లో కూడా చికెన్‌ రేట్లు పెరగడంతో ధరల్లో స్వల్ప మార్పులు చేస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో అన్ని రెస్టారెంట్లలో అమలులోకి రాకపోయినప్పటికీ అక్కడక్కడా బిర్యానీ, చికెన్‌ ఉత్పత్తుల ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.

- Advertisement -

ధరల పెరుగదలకు తీవ్ర ఎండలే కారణం..

కోళ్లను కాపాడుకోవడానికి పౌల్ట్రి నిర్వాహకులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రతి రోజూ సగటున 44 నుండి 45 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదవుతుండటంతోపాటు తీవ్రమైన వడగాడ్పులు వీస్తుండటంతో కోళ్లను రక్షించుకోవడం నిర్వాహకులకు పెద్ద తంతుగా మారింది. కోళ్లకు బలమైన ఆహారం అందించడంతోపాటు ప్రతి గంటకూ నీటితో తడపకపోతే వేడికి అవి చనిపోయే ప్రమాదం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈక్రమంలోనే నీటిని అధికంగా తాగటం మూలంగా ఆహారం పెద్దగా తీసుకోవడం లేదని, ఫలితంగా బరువులో చాలా వ్యత్యాసాలు వస్తున్నాయని చెబుతున్నారు.

సాధారణ రోజుల్లో ఒక్కో కోడి 2 కేజీల నుండి 2.5 కేజీల వరకూ బరువు వచ్చేవని, కానీ, ప్రస్తుతానికి అవి కేజీ నుండి 1.5 కేజీల బరువు వచ్చేప్పటికి గగనంగా మారుతుందని చెబుతున్నారు. ఈక్రమంలో చికెన్‌ షాపులకు సరఫరా తగ్గిపోతోందని అంటున్నారు. విపరీతమైన వడగాడ్పుల మూలంగా బరువు తగ్గడంతో మార్కెట్‌ అవసరాలకు సరిపడా చికెన్‌ కూడా సరఫరా చేసే పరిస్థిత లేకుండా పోతోంది.

కిలో రూ.200 నుండి రూ.350 వరకూ

మామూలు రోజుల్లో ఒక్కో కోడి బరువు సగటున 2 నుండి 2.5 కేజీల వరకూ బరువు ఉంటుంది. ఇపపుడు ఎండ వేడికి తాళలేక ఆహారం తీసుకోక పోవడంతో కేజీ నుండి కేజీ న్నర లోపే బరువు ఉంటున్నాయి. అవికూడా సాధారణ పౌల్ట్రిలలో అందుబాటులో లేవు. కేవలం కంపనీలకు చెందిన పౌల్ట్రిలలోనే ఉంటున్నాయి. దీనికితోడు ఫారాల్లో కోళ్లను రక్షించుకోవడానికి గంట గంటకు నీరు కొట్టడం, ఇతరత్రా ఏర్పాట్లకు ఖర్చు పెరుగుతోంది. కరెంటు బిల్లులు కూడా పెరుగుతున్నాయి. దీంతో కిలో రూ.200 వరకూ ఉన్న చికెన్‌ ఇప్పుడు రూ.350కు పెరిగింది.

పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు..

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ అనంతరం చికెన్‌ రికార్డు స్థాయి ధరలను నమోదు చేసింది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా చికెన్‌ వైపు వినియోగదారుల అంతగా మొగ్గు చూపలేదు. ఓ దశలో స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.80 దిగివచ్చింది. అయితే సెకండ్‌ వేవ్‌ తగ్గిన అనంతరం చికెన్‌ ధర పెరుగుతూ వచ్చింది. ఓ దశలో కిలో రూ.280కి చేరి ఆల్‌టైం రికార్డును నెలకొల్పింది. తరువాత ఆ రికార్డులను అధిగమించే ఏకంగా రూ.350కు చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి చికెన్‌ ధర కిలో రూ.200 మార్కును దిగకుండా కొనసాగుతోంది.

ఈ ఏడాది జనవరి 1న రూ.214 వద్ద నిలకడగా ఉన్న ధర మార్చి 1 నాటికి రూ.280కి ఎగబాకింది. అనంతరం కొద్దిపాటి తగ్గుదల నమోదవుతూ వచ్చిన మే 1వ తేదీ నుంచి ధరల పెరుగుదల రికార్డు స్థాయికి చేరింది. మే 1వ తేదీ రూ.228గా ఉన్న కిలో స్కిన్‌లెస్‌ ధర మే 12వ తేదీ నాటికి రూ.312కు ఎగబాకింది. ఇప్పుడు రూ. 350 వరకూ చేరుకుని ఆల్‌-టైం రికార్డు సృష్టించింది.

వేసవి ప్రభావం..

ప్రతి పౌల్ట్రీకి 4,500 నుంచి 7 వేల వరకు బ్రాయిలర్‌ కోళ్ల పెంపకానికి కంపెనీలు పిల్లలను అందిస్తాయి. కొంతమంది సొంతంగా కొనుగోలు చేస్తారు. ఇవి 72 రోజుల వ్యవధిలో కిలోన్నర నుంచి రెండున్నర కిలోల వరకూ పెరుగుతాయి. వేసవికాలంలో వీటిని పెంచేందుకు పౌల్ట్రీల వద్ద షెడ్డులు కూల్‌గా ఉంచాలి. ఇందుకోసం డ్రిప్‌ విధానాన్ని అమలుచేసి షెడ్డులు తడుపుతుంటారు.

ఈ వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండడం, వేడి గాలులు వీస్తుండడంతో బ్రాయిలర్‌ కోళ్లు అధికంగా చనిపోతుండడంతో దిగుబడి పూర్తిగా పడిపోతోంది. వీటికి తోడు కోడి మేత ధర పెరిగింది. బ్రాయిలర్‌ కోడికి ప్రధాన మేతగా పరిగణిస్తున్న సోయాబీన్‌ మేత కిలో రూ.102 నుంచి రూ.113 మధ్య ఉంది. గతంలో కిలో రూ. 60 ఉండేది. సాధారణ మొక్కజొన్న మేత కిలో రూ.13 లు నుంచి రూ.23కు ఎగబాకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement