న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియోపై ఏపీ మహిళా జేఏసీ బృందం చేసిన ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. వారం రోజుల క్రితం డిగ్నిటీ ఫర్ విమెన్ పేరుతో మహిళా నేతలు చేసిన ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్‌కు పంపింది. జేఏసీ కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం లేఖను పంపింది. డిగ్నిటీ ఫర్ వుమెన్’ జేఏసీగా ఏర్పడిన బృందానికి వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డా. చెన్నుపాటి కీర్తి కన్వీనర్‌గా వ్యవహరించారు.
కో-కన్వీనర్లుగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేత సుంకర పద్మశ్రీ వ్యవహరించగా… ఐద్వా ప్రతినిధి ఎస్. పుణ్యవతి, పి. రాణి (NFIW), తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరుగనగరి, ఆ పార్టీ నేతలు ముల్పురి నాగ కళ్యాణి, అన్నాబత్తుని జయలక్ష్మితో పాటు ఏపీ స్టేట్ కుర్బ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంజీవరెడ్డి సవిత సభ్యులుగా ఉన్నారు. వీరంతా కలిసి ఢిల్లీ వెళ్లి మరీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, జాతీయ మహిళా కమిషన్, పలువురు కేంద్ర మంత్రులకు మాధవ్‌పై ఫిర్యాదు చేశారు. మహిళల ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తించిన మాధవ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.