హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఇప్పటికే శీతాకాల విడిది కోసం ఒకసారి ఆమె తెలంగాణకు రాగా.. మరోసారి హైదరాబాద్ పర్యటన ఖరారైంది. అప్పుడు ఐదు రోజుల పర్యటన సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాష్ట్రపతి పర్యటించి వెళ్లిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 16, 17వ తేదీల్లో హైదారాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు సమావేశం కానున్నారు.
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి అధ్యక్షతన అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి కార్యక్రమాలు, షెడ్యూల్ విడుదల కానుంది. శీతాకాల విడిదికి వచ్చినపుడు రాష్ట్రపతి తెలంగాణలోని రామప్ప ఆలయం, భద్రాచలం ఆలయాన్ని ఆమె సందర్శించారు. అనంతరం ఆలయ విశిష్టతలను అడిగి తెలుసుకున్నారు.
అంతేకాకుండా ఇటు ఏపీలో శ్రీశైలం దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. శ్రీమల్లిఖార్జున స్వామి వారి సేవలో పాల్గొని పూజలు నిర్వహించారు. అంతేకాకుండా దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. రాష్ట్రపతి తాజా పర్యటనకు సంబంధించిన వివరాలు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఆమె రాష్ట్రపతి పర్యటన ఎక్కడెక్కడ కొనసాగుతుంది.. ఎలాంటి కార్యక్రమాలకు హాజరవుతారన్న వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.