Tuesday, November 26, 2024

Delhi: పోస్టులు తీసుకుని పోస్ట్‌మ్యాన్ కాదలుచుకోలేదు.. ఏ పదవీ కోరుకోలేదు: వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పేర్లకు ముందు ‘ప్రధానమంత్రి’ అన్న పదాన్ని జోడించాల్సిందిగా తానే సూచించి, పట్టుబట్టానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో తన పదవీ బాధ్యతలు ముగుస్తున్న చివరి రోజు తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా ప్రతినిధులకు మధ్యాహ్న విందు ఏర్పాటు చేశారు. విందు తర్వాత తెలుగు మీడియా ప్రతినిధులతో వెంకయ్య ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. తన కెరీర్ ఎలా ప్రారంభమైందనేది వెల్లడించారు. తాను ఏ రోజూ ఏ పదవినీ ఆశించలేదని, పదవులే తనను వెతుక్కుంటూ వచ్చాయని అన్నారు.

రాష్ట్రపతి పదవి ఆశించలేదని, ఏ పదవులూ తీసుకుని పోస్ట్‌మ్యాన్ కాదలుచుకోలేదని హాస్యమాడారు. వాజ్‌పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయానికి పార్టీని ఎవరు చూసుకుంటారన్న ప్రశ్న తలెత్తిందని, దానికి తాను ఏమాత్రం సంకోచించకుండా తాను పార్టీని చూసుకుంటానని చెప్పానని గుర్తు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆర్థికాంశాలతో సంబంధం లేని శాఖే కావాలన్నానని తెలిపారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖను కోరుకోగా, అది మిత్రపక్షంలో నితీశ్ కుమార్ నిర్వహిస్తున్నందున కుదరలేదని, దాంతో తాను గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకున్నానని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

మోదీ ప్రధాని అయ్యాక పట్టాణాభివృద్ధి శాఖను కేటాయించారని, గ్రామీణ నేపథ్యం కలిగిన తనకు పట్టణాభివృద్ధి దేనికని ప్రశ్నిస్తే.. గ్రామాల్లో జనాభా ఉపాధి కోసం పట్టణాలకే వలసపోతున్నారని, వారి కోసం పనిచేయమని సూచించారని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి 14 గంటలు పని చేస్తారని, మితాహారం తీసుకుంటారని అనేక ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో క్యాస్ట్, క్యాష్, కమ్యునిటీ, క్రిమినాలిటీ వచ్చి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకంతో కొన్నిసార్లు ఓటమిని చవి చూశానని అన్నారు. కానీ ఆ ఓటమి తనకు మంచే చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై తనకు ఇన్నాళ్లూ ఉపరాష్ట్రపతికి ఉన్న ప్రోటోకాల్ ఉండదని, స్వేచ్ఛాజీవినని అన్నారు. తిరిగి పార్టీలోకి రావడం మీదా ఆయన స్పందించారు.

అలాంటి ఆలోచన ఏదీ లేదని, కాకపోతే ఇకపై ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. తన అనుభవాలతో పుస్తకం రాసే ఆలోచనలో ఉన్నానని వెల్లడించారు. అయితే పుస్తకాలు రాయాలంటే నిజాలే రాయాలన్న వెంకయ్య, నిజాలు నిష్టూరంగా ఉంటాయని ఆలోచిస్తున్నానని అన్నారు. తన జీవిత ప్రయాణంలో వివిధ హోదాల్లో 612 జిల్లాలు తిరిగానని వివరించారు. ఇకపై కూడా ప్రయాణాలు చేస్తూ, తనకు నచ్చిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. ఎక్కడ, ఏ పదవిలో ఉన్నా మీడియా, ప్రతిపక్షాల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉండేవని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement