– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
‘వ్యభిచార గృహం నడుపుతున్నారు’ అంటూ పదే పదే పోలీసులనుంచి ఫోన్‌లు వస్తున్నాయి. బ్యూటీ పార్లర్‌లో వ్యభిచార గృహం నడుపుతున్నారంటూ ఓ సారి.. ఇంట్లో రైడ్ జరగబోతోందంటూ మరోసారి.. ఇలా మొత్తం మూడుసార్లు ఆమెకు ఫోన్ చేసి హడలగొట్టారు. చేతికందినకాడికి డబ్బులు దోచేశారు. పోలీసుల ఆగడాలు తాళలేకపోయిన ఆమె దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీడియాతో సైతం తన బాధను పంచుకుంది. ఈ ఘటన కర్నాటకలోని మంగళూరులో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దక్షిణ కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఓ మహిళ కూతురు సినిమా ఇండస్ట్రీలో నటిగా స్థిరపడింది. సదరు మహిళ మంగళూరులో ఓ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆ బ్యూటీ పార్లర్ దగ్గరకు వచ్చాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. ‘ మీ బ్యూటీ పార్లర్‌లో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు సమాచారం అందింది. మీరు మాకు సహకరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు గూగుల్ పేలో డబ్బులు పంపితే రైడ్ చేయము’ అని చెప్పాడు. భయపడిపోయిన ఆమె డబ్బులు పంపింది. ఆ డబ్బులు తన ఖాతాలోకి రాగానే ఆ పోలీస్ అక్కడినుంచి వెళ్లిపోయాడు.
రెండు రోజుల తర్వాత ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.‘నా పేరు శివరాజ్ దేవాడిగే.. పండేశ్వర మహిళా పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నాను. మీ ఇంట్లో భారీగా బంగారం, డబ్బులు ఉన్నట్లు సమాచారం వచ్చింది. మీరు డబ్బులు ఇవ్వకపోతే రైడింగ్ వస్తాం’ అని అన్నాడు. దీంతో ఆమె 18 వేల రూపాయలు గూగుల్ పే చేసింది. మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేసిన ఆ వ్యక్తి ‘ మీ ఫైల్ పోలీస్ కమిషనర్ ఆఫీస్‌కు వెళ్లింది. అక్కడి వాళ్లకు లంచం ఇవ్వడానికి డబ్బులు పంపండి’ అని అన్నాడు. దీంతో ఆమె 30 వేల రూపాయలు అతడికి పంపింది. తరచుగా పోలీసులు తమను ఇబ్బంది పెట్టడంపై ఆమెకు అనుమానం వచ్చిందిదీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నాకు ఒక కుటుంబం ఉంది. నేను ఏ తప్పు చేయకపోయినా.. నన్ను ఇబ్బందిపెడుతున్నారు. రెండు పోలీస్ స్టేషన్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులు నా నుంచి డబ్బులు దోచేశారు. పండేశ్వర మహిళా పోలీస్ స్టేషన్‌నుంచి శివరాజ్ దేవాడిగే అనే వ్యక్తి డబ్బులు దోచాడు. అసలు ఆ వ్యక్తి పోలీసా కాదా? అన్న సంగతి కూడా నాకు తెలీదు’’ అని అంది. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.