న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మూడు రాజధానుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ ఈనెల 14కు వాయిదా పడింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ కేసు విచారణ నుంచి తప్పుకున్న తర్వాత జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే అప్పటికే బెంచ్ కార్యాకలాపాలు ముగియనుండడంతో కేసు విచారణ వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కేసును ప్రత్యేక పరిస్థితుల్లో విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. అంత అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరమేంటో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. తాము పిటిషన్లను ఇంకా పరిశీలించలేదని, పరిశీలించకుండా విచారణ చేపట్టడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. తమ బెంచ్ ముందుకొచ్చిన పిటిషన్లను పరిశీలించిన తర్వాతనే వాదనలు వింటామని, అప్పటి వరకు వేచి ఉండాలని సూచించింది.
మరోవైపు ప్రతివాదులుగా ఉన్న రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున న్యాయవాదులు ఈ కేసులో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని.. ప్రభుత్వంపై ఉల్లంఘన పిటిషన్ దాఖలు చేశామని న్యాయస్థానానికి వివరించారు. రాష్ట్ర హైకోర్టు మార్చిలో తీర్పునివ్వగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తమకు కొంత సమయమిస్తే పిటిషన్లపై అధ్యయనం చేసి తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ నెల 7వ తేదీకి విచారణ వాయిదా వేస్తామని తెలిపింది. తమకు వారం రోజుల సమయం ఇవ్వాలని రైతుల తరఫు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ ధర్మాసనాన్ని కోరారు. వారం రోజులు సమయమిస్తే కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కోర్టు సౌకర్యార్థం ఒక అఫిడవిట్‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నారీమన్ పేర్కొన్నారు. అంత సమయం కాకుండా 7వ తేదీనే విచారణకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.