న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభల్లో సీట్ల సంఖ్య పెంపు వ్యవహారంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంచతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతిగా పనిచేసిన రిటైర్డ్ ప్రొఫెసర్ కే. పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పొందుపర్చిన విధంగా తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీట్ల సంఖ్యను 175 నుంచి 225 వరకు పెంచాలని పిటిషనర్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుపై కేంద్రాన్ని ప్రశ్నించినప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సీట్ల సంఖ్యను పెంచాలని సూచిస్తున్నప్పటికీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత సేకరించే జనాభా సంఖ్య ఆధారంగా (అంటే 2031 జనాభా లెక్కల అనంతరం) మాత్రమే దేశంలోని చట్టసభల్లో సీట్ల సంఖ్యలో పెంపు, డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని కేంద్రం చెబుతూ వచ్చింది. అయితే 2019లో ఆమోదించిన జమ్మూ-కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్యను 83 నుంచి 90కు పెంచాలని పొందుపరిచారు. ఈ మేరకు 2020లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సులను 2022 మే 5న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
ఈ క్రమంలో “ఆర్టికల్ 170 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు ఇప్పుడు సాధ్యం కాదన్నప్పుడు, జమ్ము-కాశ్మీర్ విషయంలో అదే ఆర్టికల్ 170 ఎందుకు వర్తింపజేయలేదు? ఒకవేళ జమ్ము-కాశ్మీర్ విషయంలో సీట్ల సంఖ్య పెంపు, డీలిమిటేషన్ సాధ్యమైనప్పుడు తెలుగు రాష్ట్రాల విషయంలో ఎందుకు సాధ్యం కాదు? అంటే జమ్ము-కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందా?” అనే మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఇవే అంశాలను తన పిటిషన్లో లేవనెత్తారు. అయితే జమ్ము-కాశ్మీర్ డీలిమిటేషన్ ప్రక్రియను సవాలు చేస్తూ ఇప్పటికై దాఖలైన రిట్ పిటిషన్ (హాజీ అబ్దుల్ గనీ ఖాన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా)తో ఈ కేసును జతపరుస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 4న జరగనుంది.