అమరావతి, ఆంధ్రప్రభ: అస్పృశ్యత నిర్మూలన.. సామాజిక న్యాయం.. మహిళా సాధికారత కోసం నిరంతరం శ్రమించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ, శతాబ్దాల నాడే అణగారిన వర్గాల కోసం, స్త్రీ విద్య కోసం చిత్తశుద్ధితో ముందుకు వెళ్లిన ఆయన మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు.
సామాజిక విప్లవం, న్యాయం సాధించాలనుకొనే వారు తప్పనిసరిగా జ్యోతిరావు ఫూలే జీవిత చరిత్ర చదవాలని సూచించారు. ఫూలే జయంతి సందర్భంగా ఆ మహాత్మునికి ప్రణామాలు అర్పిస్తున్నానన్నారు. సమన్యాయ సత్యశోధకులైన మహాత్మా ఫూలే చెప్పిన మాటలను వల్లె వేయడం కాకుండా వాటిని ఆచరించి చూపించడం, జనసేన పార్టీ విధివిధానాల్లో భాగమని పవన్ కల్యాణ్ తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..