రైతుల నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కంగన రౌనత్‌పై సొంత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. సాగు చట్టాలపై నిరసనలు కొనసాగేలా కుట్ర జరిగే అవకాశమున్నదని, రైతుల నిరసనలను మోడీ సర్కర్ కట్టడి చేయనిపక్షంలో భారత్ మరో బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పైగా అల్లర్లు సృష్టించే వారికి దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై బీజేపీ అధిష్ఠానం సీరియస్‌గా చర్యలు తీసుకున్నది. కంగనా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, పార్టీ బాధ్యత వహించబోదని బీజేపీ స్పష్టం చేసింది.
పార్టీ తరపున విధానపరమైన అంశాలపై మాట్లాడే అధికారం కంగనా రనౌత్‌కు లేదని, అందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది. ఎంపీ కంగనాను సున్నితంగా మందలించిన అధిష్ఠానం వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఆమెకు సూచించింది.