న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తు కాంగ్రెస్ ముమ్మరంగా కొనసాగిస్తున్నప్పటికీ గత మూడు రోజులుగా జరిగిన కసరత్తులో 70 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిసింది. అభ్యర్థుల వడపోత కోసం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ గురువారం అర్థరాత్రి దాటే వరకు సమావేశమవగా.. శుక్రవారం మధ్యాహ్నం గం. 12.00 నుంచి సాయంత్రం గం. 5.00 వరకు కుస్తీ పట్టింది.
మిగతా స్థానాలపై త్వరలో మరోసారి భేటీ కానున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పేరున్న నేతలు పోటీ చేసే స్థానాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో ఒక్కో సీటు కోసం ఇద్దరు లేదా ముగ్గురి మధ్య గట్టి పోటీ నెలకొంది. అలాంటి స్థానాల్లో పోటీలో ఉన్న నేతలు ఒక్కొక్కరూ ఒక్కో వర్గానికి చెందినవారు కావడంతో తమ వారికి టికెట్ ఇప్పించుకోవడం కోసం స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క.. ఎవరికి వారుగా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో కొన్ని సీట్లపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. అంతేకాదు, కొన్ని సీట్ల విషయంలో నేతల మధ్య వాగ్యుద్ధం కూడా జరిగిందని సమాచారం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొందరు అభ్యర్థుల విషయంలో విబేధించుకోవడంతో పాటు పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన కమిటీ సభ్యులు జిగ్నేష్ మేవానీ, బాబా సిద్ధిఖి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులుగా ఉన్న ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి కలిసి ఈ కసరత్తును చేపట్టిన విషయం తెలిసిందే.
వివిధ నియోజకవర్గాల్లో పోటీ కోసం టీపీసీసీ దరఖాస్తులు ఆహ్వానించగా తెలంగాణలోని 119 స్థానాలకు 1000 మందికి పైగా ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో నుంచి ప్రాథమికంగా టీపీసీసీ వడపోసి 300 మందితో జాబితాను సిద్ధం చేసింది. టీపీసీసీ నాయకత్వం ఆ జాబితాను స్క్రీనింగ్ కమిటీ ముందు పెట్టగా.. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో పాటు మరికొన్ని సంస్థలు జరిపిన సర్వే నివేదికలు, ఆర్థిక, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్టు తెలిసింది. పార్టీ సీనియర్ నేతలు పోటీ చేసే సుమారు 25-30 నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వంపై పోటీ లేనప్పటికీ.. మిగతా నియోజకవర్గాల్లో ఇద్దరు నుంచి ముగ్గురు ఆశావాహుల మధ్య పోటీ గట్టిగా ఉంది.
ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఏకాభిప్రాయం కుదిరితే జాబితా సిద్ధమైనట్టేనని పార్టీ నేతలు చెప్పారు. కానీ మూడు రోజుల కసరత్తులో కేవలం 70 స్థానాల విషయంలోనే ఏకాభిప్రాయం కుదరగా.. మిగతా సీట్లలో ఏకాభిప్రాయం లేకపోవడంతో స్క్రీనింగ్ కమిటీ వాటిని పెండింగులో పెట్టింది. కమిటీ ఖరారు చేసిన 70 స్థానాల జాబితాను శుక్రవారం అధిష్టానానికి అందజేసినట్టు తెలిసింది. ఆ జాబితాను ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఓసారి పరిశీలించి, చర్చించి అధిష్టానానికి నివేదిస్తుంది. ఆ తర్వాత ఏఐసీసీ నుంచి అభ్యర్థుల జాబితా విడుదలవుతుంది.
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే మొత్తం 119 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించాలని చూస్తున్నారు. కానీ చాలా స్క్రీనింగ్ కమిటీలో నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో.. తొలి జాబితాగా 70 మంది పేర్లను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. మిగతా సీట్లపై కసరత్తు కొనసాగిస్తూ.. స్క్రీనింగ్ కమిటీ స్థాయిలో తేల్చలేకపోతే.. పేర్లను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి వదిలేయాలని చూస్తోంది.
ఇదిలా ఉంటే.. ఆశావాహులు ఢిల్లీ బాటపట్టారు. ఎలాగైనా సరే టికెట్ దక్కించుకోవడం కోసం అధిష్టానం పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. అద్దంకి దయాకర్, ప్రీతం, మల్రెడ్డి రాంరెడ్డి, కైలాశ్ నేత, సర్వే సత్యనారాయణ సహా పలువురు అధిష్టానం పెద్దల చుట్టూ ప్రదిక్షిణాలు చేస్తున్నారు. ఎల్బీనగర్ స్థానం కోసం మల్రెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలాగే తుంగతుర్తి నియోజకవర్గం టికెట్ కోసం అద్దంకి దయాకర్, ప్రీతంతో పాటు మరొక అభ్యర్థి పోటీలో ఉన్నారు.
ఈ ముగ్గురిలో అద్దంకి దయాకర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ మద్దతు ఉన్నప్పటికీ.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి మరికొన్ని నియోజకవర్గాల విషయంలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. అటువంటి చోట రెండు పేర్లతో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితాను పంపించాలని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ నిర్ణయించినట్టు తెలిసింది. ఒకవేళ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా తేల్చని పక్షంలో అధిష్టానం పెద్దలే తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
అదే సమయంలో బీజేపీ లేదా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరేవారికి టికెట్ ఇచ్చే విషయం కూడా అధిష్టానం పెద్దలకే వదిలేసి మొత్తం 119 స్థానాలకు స్క్రీనింగ్ కమిటీ, ఎలక్షన్ కమిటీలు కసరత్తు చేస్తాయని నేతలు చెబుతున్నారు. ఒకవేళ సీపీఐ, సీపీఐ(ఎం) వంటి కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చినా సరే.. ఏయే స్థానాలను వారికి వదిలేయాలన్న అంశాన్ని సైతం అధిష్టానానికే వదిలేయాలని టీపీసీసీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది.