Saturday, November 23, 2024

ఐటీరంగంలో కొనసాగుతున్న సిబ్బంది ఉద్వాసనలు.. టెక్‌ రంగంపై ఆర్థిక ఒత్తిళ్లు

సాప్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పరంపర కొనసాగుతోంది. ప్రముఖ మల్టినేషనల్‌ టెక్‌ కంపెనీలైన గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాప్ట్‌, మెటా బాటలో మరిన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.తాజాగా ఈ జాబితాలో ఐటీ దిగ్గజం ఐబీఎం, జర్మనీ కంపెనీ ఎస్‌ఏపీ చేరింది. కంపెనీలోని 3900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఐబీఎం పేర్కొనగా, 3000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ఎస్‌ఏపీ వెల్లడించింది. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో లక్ష్యాలను అందుకోలేక పోయామని, దీనికితోడు కొన్ని అసెట్‌ డివెస్ట్‌మెంట్ల కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

మొత్తం ఉద్యోగుల్లో ఇది 1.5 శాతం మాత్రమేనని తెలిపింది. అయితే క్లయింట్‌-ఫేసింగ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో నియామకాలు కొనసాగిస్తామని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జేమ్స్‌ కవనాగ్‌ వెల్లడించారు. 2022లో కంపెనీ 10 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా ఎంచుకుంది. కానీ అది 9.3 బిలియన్‌ డాలర్ల వద్ద ఆగింది. నిర్వహణ మూలధన వ్యయాలు అంచనాలను మించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఐబీఎం తెలిపింది.

- Advertisement -

మరోవైపు ఎస్‌ఏపీ కూడా ఆర్థికపరమైన భారాలను ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణంగా చూపుతోంది. కీలక వ్యాపారాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా కొన్ని ప్రాజెక్టులను పునర్‌ వ్యవస్థీకరిస్తున్నామని ఎస్‌ఏపీ వివరించింది. ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపు అనివార్యమైందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1.2లక్షల మంది సిబ్బంది పనిచేస్తుండగా, తాజా తొలగింపులు ఇందులో 2.5శాతం మాత్రమేనని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాద్యం భయాల నేపథ్యంలో ఐటీ కంపెనీలు క్రమంగా ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. దీంతో అమెజాన్‌లో 18 వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోగా, మెటా 11 వేలు, గూగుల్‌ 12 వేలు, మైక్రోసాప్ట్‌ 10 వేల మందిని తొలగించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement