న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత దేశంతో పాటు ఇతర దేశాల్లో డ్రగ్స్ నియంత్రణలో అనుసరిస్తున్న శిక్షలు, విధానాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. బుధవారం లోక్‌సభలో ‘మాదకద్రవ్యాల నియంత్రణ’ అనే అంశంపై రూల్ 193 ప్రకారం జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, డ్రగ్స్ నియంత్రణ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాదకద్రవ్యాలను నియంత్రించే క్రమంలో దూకుడుగా వెళ్లే ముందు ఇతర దేశాలు వీటిపై ఎలాంటి యుద్ధం చేస్తున్నాయో గమనించడం చాలా ముఖ్యమని అన్నారు. ఫిలిప్పీన్స్ గత 6-7 సంవత్సరాలుగా డ్రగ్స్‌పై నియంత్రణను గట్టిగా అమలు చేసిందని, ఇది డ్రగ్స్ కేసుల సంఖ్యను తగ్గించటం కంటే వందలాది హత్యలకు దారితీసిందని చెప్పారు. హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకారం 12,000 మందికి పైగా ఫిలిప్పీన్స్ జాతీయులు తమ ప్రాణాలు కోల్పోయారని, వారిలో కనీసం 2,555 మంది ఫిలిప్పీన్స్ నేషనల్ పోలీసుల చేతిలో హతమయ్యారని ఎంపీ లావు తెలిపారు.
అమెరికా గత 40 సంవత్సరాలుగా మాదకద్రవ్యాలపై యుద్ధం చేస్తోందని, ఇందులో అమలు చేసే శిక్షలు బెడిసికొట్టాయని చెప్పారు. గత 30 ఏళ్లలో డ్రగ్స్‌పై యుద్ధం కారణంగా మరణాలు 10,000 నుంచి 40,000కి పెరిగాయని, 1980 – 2020 మధ్యలో అరెస్టులు 15 వేల నుండి 15 లక్షలకు పెరిగాయని వివరించారు. భారతదేశంలో కూడా శిక్షలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని చెప్పారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 60,000 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ విషయంలో చికాగోలోని నార్కోటిక్స్ అరెస్ట్ డిపార్ట్మెంట్ అనుసరించిన నమూనా విజయవంతమైందని, పోలీస్, పబ్లిక్ హెల్త్, బిహేవియరల్ హెల్త్, క్రైమ్ ల్యాబ్‌లు, హెల్త్ ల్యాబ్‌లు వంటి సంబంధిత విభాగాలను ఏకతాటిపైకి తెచ్చి అరెస్టయిన వ్యక్తికి కౌన్సెలింగ్ ఇస్తున్నారని ఉదహరించారు.
దేశవ్యాప్తంగా డీ-అడిక్షన్ సెంటర్లు అందుబాటులో లేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.5 కోట్ల 15 డీ-అడిక్షన్ సెంటర్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. దేశవ్యాప్తంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అదనపు నిధులు కేటాయించాలని కోరారు. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రెడ్యూసింగ్ ( ఎన్ఏపీడీడీఅర్) కింద బడ్జెట్ వినియోగం చాలా దారుణంగా ఉందని, రూ.200 కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు రూ.40 కోట్లు మాత్రమే వినియోగించారని తెలిపారు. అమెరికాలోని డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ (డీఈఏ) చేస్తున్న తరహాలోనే ఇతర దేశాల నుంచి భారత్‌కు వస్తున్న డ్రగ్స్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దృష్టి సారించాలని ఎంపీ కృష్ణదేవరాయలు సిఫార్సు చేశారు. మాదకద్రవ్యాల నిరోధక చట్టం కూడా అత్యంత కఠినమైనదని, చట్టవిరుద్ధమైన అరెస్టులకు పరిహారం మంజూరు చేయడం కోసం చట్టం అవసరమని లా కమిషన్ కూడా సిఫార్సు చేసిందని ఆయన వాదించారు.