ప్రస్తుతం దేశంలో పని చేస్తున్న ఎయిర్‌పోర్టుల సంఖ్య 140కి చేరాయి. రేపు (ఆదివారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. 2014కు ముందు దేశంలో 74 ఉన్న ఎయిర్ పోర్టుల సంఖ్య ప్రస్తుతం 140కి చేరాయి. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ సంఖ్యను 220కి చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిన తరువాత దేశంలో ఎయిర్ కనెట్టివిటీ పెంచాలని నిర్ణయించారని, దానిలో భాగంగానే ఆయన అనేక కొత్త ఎయిర్‌పోర్టులుక శంకుస్థాపనలు చేయడంతో పాటు, కొత్తవాటికి ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాన మంత్రి నవంబర్‌లో ఈటానగర్‌లోని డోనాయ్ పోలో ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. జులైలో డియోఘర్ ఎయిర్ పోర్టును ప్రారంభించారు. గత సంవత్సరం నవంబర్‌లో ఉత్తర ప్రదేశ్‌లోని జెవార్ లో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ప్రముఖ బుద్దిస్ట్ ప్రాంతమైన కుషీనగర్‌లో అంతర్జతాతీయ ఎయిర్‌పోర్టును అక్టోబర్‌లో ప్రారంభించారు.
గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాన మంత్రి మోడీ 2016 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు డిసెంబర్ 11న ప్రారంభోత్సవం చేయనున్నారు. గోవాలో ఇది రెండో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. మొదటి ఎయిర్‌పోర్టు దబోలిమ్ లో ఉంది. కొత్త ఎయిర్‌పోర్టులో అనేక ప్రత్యేకతలు, ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న దబోలిమ్‌లో ఉన్న ఎయిర్ పోర్టు సంవత్సరానికి 8.5 బిలియన్ ప్యాసింజర్ సామర్ధ్యం కలిగి ఉంది. కొత్త ఎయిర్‌పోర్టు మోపా సంవత్సరానికి 13 మిలియన్ల ప్రయాణీల సామార్ధ్యం కలిగి ఉందని అధికారులు వివరించారు. గోవాలోని ఈ రెండు ఎయిర్‌పోర్టుల సామర్ధ్యాన్ని 43.5 మిలియన్ ప్యాసింజర్ల వరకు విస్తరించుకునేందుకు అవకాశం ఉంది.
పాత ఎయిర్‌పోర్టు దబోలిమ్ నుంచి 15 దేశీయ ప్రాంతాలకు, 6 అంతర్జాతీయ ప్రాంతాలకు సర్వీస్‌లు నడుస్తున్నాయి. కొత్త ఎయిర్‌పోర్టులో 35 దేశీయ ప్రాంతాలకు, 18 అంతర్జాతీయ ప్రాంతాలకు సర్వీస్‌లు నడవనున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న దబోలిమ్ ఎయిర్‌పోర్టులో రాత్రి విమానాలు దిగే సదుపాయం లేదు. కార్గో సదుపాయం కూడా లేదు. జీఎంఆర్ నిర్మించిన ఈ కొత్త ఎయిర్‌పోర్టులో నైట్ ల్యాండింగ్ సదుపాయంతో పాటు, సంవత్సరానికి 25 వేల టన్నుల కార్గోను హ్యాండిల్ చేసే సామార్ధ్యం కలిగి ఉంది.