హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకానికి గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుగానిలవడంతో పురోగతిలో ఉన్న పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. పనులు వేగంగా ముందుకు సాగుతున్న తరుణంలో ప్రాజెక్టు చుట్టూ కొందరు సమస్యల వలయం సృష్టించి గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదుచేయడంతో ట్రిబ్యునల్ పనులను నిలిపివేసింది. ఈ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు కలగుండా తిరిగి డీపీఆర్ ను రూపొందిస్తోంది. ఈప్రాజెక్టు పూర్తి అయితే 6లక్షల 74 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు వందలాది గ్రామాలకు తాగునీటి సౌకర్యం ఏర్పడనుంది.
అయితే తొలిదశలో తాగునీటి అవసరాలకు అనుమతి కోరుతూ గ్రీన్ డ్రిబ్యునల్ కు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఈ మేరకు ఇటీవల గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టును పరిశీలించారు. అలాగే ప్రాజెక్టుపై వచ్చిన ఫర్యాదులను క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. ఈ నేథ్యంలో గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు సాగునీటి శాఖ భావిస్తోంది.
సీతారామప్రాజెక్టు వివరాల్లోకి వెళ్లితే రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా సాగర్ రుద్రమకోట ఎత్తిపోతల పథకం ఆయకట్టును కలుపుతూ సీతరామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. గోదావరి నది 45మీటర్ల ఎత్తులో నీటిని లిఫ్ట్ చేటం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టుద్వారా ఖమ్మం జిల్లాలో 3లక్షల 29 వేలు. భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్ జిల్లాలో 3లక్షల 45వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ 0 కిలో మీటర్ల నుంచి 104.40 కిలోమీటర్ల టెండర్ల దశ పూర్తి అయ్యింది.
మొత్తం 104.40 కి.మీ గల ప్రాధాన కాలువ 8 ప్యాకేజీలుగావిభజించారు. అన్ని ప్యాకేజీల ఒప్పందాలు ముగియండంతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఆయకట్టు స్థిరీకరణతో పాటు ఖమ్మం జిల్లాలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పాలేరు రిజర్వాయరు వరకు కాలువల విస్తరణ పనులు జరిగాయి. అలాగే ఎస్‌ఆర్‌ఎల్‌పి -పాలేరు లింక్ కాలువ ప్యాకేజీ 3లో టెండర్లు ఖరారయ్యాయి. సర్వేలు, పరిశీలన, డిజైన్లు, డ్రాయింగ్స్ అంచనాలు పూర్తి అయ్యి పనులు వేగం పుంజుకున్న దశలో గ్రీన్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయం గుదిబండగా మారింది. జూలై లో ప్రాజెక్టును పూర్తిచేసేందుకు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచుతుండగానే
కొంతమంది చేసిన ఫర్యాదులమేరకు ఆయకట్టు రైతుల ఆశలపై నీల్లు చల్లినట్లయింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అంచనావ్యయం రూ. 5వేల కోట్లకు చేరుకుంది. ఆలస్యమవుతుంటే అంచనావ్యయం పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రసుతం ఉన్న డీపీఆర్ మేరకు ప్రాజెక్టు ఎత్తు 68మీటర్లు కాగా పొడవు 1.263 పొడవులో ప్రాజెక్టు నిర్మాణపనులు కొనసాగనున్నాయి. స్విల్ వేలు 52 ఉండగా సిల్ వే సామర్ధ్యం 88.614 గా నిర్ధారించారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతం సుమారు మూడు కిలోమీటర్లుగా అంచనావేశారు.
ఇప్పటికే ప్రజాభిప్రాయం సేకరించిన గ్రీన్ ట్రిబ్యునల్ క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో ప్రాజెక్టు నిర్మాణాలకు అనుమతులు లభించనున్నాయనే ఆశాభావం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణానికి ఎలాంటి ముప్పువాటిళ్లకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావడంతో తిరిగి పనులు ప్రారంభమయ్యే అవకాశాలు అధికమవతున్నాయి.