న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి రాజ్యాంగకర్త, భారతరత్న బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని తెలుగు రాష్ట్రాల మాదిగ సంఘాల జేఏసీ వ్యవస్థాపకులు డా.పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఢిల్లీ తరలివచ్చిన మాదిగ సంఘాల నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా దళితులు, దేశ ప్రజల సంపూర్ణ విశ్వాసాన్ని పొందాలని రవి, తెలుగు రాష్ట్రాల ఛైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. మాదిగల సమస్యల సాధనకు, మాదిగలకు 12శాతం రిజర్వేషన్ సాధనే అంతిమ లక్ష్యంగా ఉద్యమం నడుపుతామని తెలిపారు.
దళితుల అభ్యున్నతి గురించి ఆలోచించాలని, పెరిగిన జనాభాకు అనుగుణంగా దళితులకు 20 శాతం రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైసా ఉపేందర్, మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్, రాష్ట్ర అధ్యక్షుడు బొల్లికొండ వీరేందర్, దళిత సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు బుదాల బాబూరావు, దళిత దండు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోగిలయ్య, కురుపాటి సుదర్శన్, మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు, అక్కపాక సంపత్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.