హైదరాబాద్, ఆంధ్రప్రభ: పెంచిన విద్యుత్ చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు చెల్లించిన బిల్లుల కంటే ఏప్రిల్ నుంచి చెల్లించే బిల్లులు దాదాపు 14శాతం వరకు వినియోగదారులపై అదనంగా భారం పడనుంది. గృహ వినియోగదారులకు ఒక యూనిట్‌కు 50పైసలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు రూ.1 పెంచుకునేందుకు విద్యుత్ పంపిణి సంస్థలకు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కరెంట్ చార్జీలతో పాటు సర్వీస్ చార్జీల వడ్డన కూడా భారీగానే పడనుంది. అంతే కాకుండా స్లాబ్‌లు మారితే విద్యుత్ బిల్లులు మరింతగా తడిసి మోపడుకానున్నాయి. మార్చిలోనే విద్యుత్ వినియోగం 14 వేల మెగావాట్ల మార్క్‌ను దాటింది. రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. దీంతో ఇళ్లలో కరెంట్ వాడకం ఇప్పడు మరింత ఎక్కువ కానుంది. ఏసీలు, కూలర్లు, ప్యాన్లు నిరంతరం వాడకంలో ఉండనున్నాయి. ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంపు వల్ల గృహ వినియోగదారులపై చార్జీల భారం రెట్టింపు కానుంది. ఇక పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లోనూ కరెంట్ బిల్లుల మోత మోగనుంది.
సర్వీస్, డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో అదనపు బాదుడు..
ఇదిలా ఉండగా ఒక వైపు ఏప్రిల్ 1 నుంచి పెరిగే చార్జీల భారం ఎలా భరించాలని వినియోగదారులు ఆందోళన చెందుతుంటే.. విద్యుత్ సంస్థలు గుట్టుచప్పుడు కాకుండా డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో మరోవైపు బాదుడు మొదలుపెట్టాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే డెవలప్‌మెంట్ చార్జీల పేరిట విద్యుత్ వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. వీటితో పాటు అదనపు లోడు క్రమబద్దీకరణ కోసం డెవలప్‌మెంట్ చార్జీల వసూలు ఏకకాలంలో కాకుండా దశలవారీగా చేపట్టాలని డిస్కంలు నిర్ణయించాయి. వాస్తవానికి హెచ్‌టీ, ఎల్‌టీ పరిశ్రమల వినియోగదారులు మాత్రమే కనెక్షన్ తీసుకునే సమయంలో తమ లోడును పక్కగా అంచనా వేసి.. ఆ మేరకు తీసుకుంటారు. 1.20 కోట్ల దాకా గృహ వినియోగదారుల్లో ఎప్పటికప్పుడు లోడు మారిన వారి సంఖ్య 50లక్షలకు పైగా ఉంటుంది. ఇటీవలే ఎన్‌పీడీసీఎల్ గృహ వినియోగదారులను పిండుకోగా, ఎస్పీడీసీఎల్ ఆ పనిని తాజాగా మొదలు పెట్టారు. అదనపు లోడు వల్ల ట్రాన్స్‌ఫార్మర్లలో సమస్యలు, లోవోల్టేజీ సమస్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగడం వంటి వాటిని లోడు బాదుడుకు కారణంగా డిస్కంలు చెబుతున్నాయి.
భారంగా మారుతున్న విద్యుత్ ఉపకరణాలు..
గృహాలకు విద్యుత్ కనెక్షన్లు తీసుకునేటప్పుడు తక్కువగా అంటే ఒక కిలోవాట్ లోడుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒక ఇంట్లో ఐదు ట్యూబ్‌లైట్లు పెట్టుకుంటే.. ఒక్కొక్కటికి 40 వాట్ల చొప్పున 200 వాట్లు ఖర్చవుతుంది. అదే రిఫ్రిజిరేటర్‌క 200 వాట్లు, నాలుగు ఫ్యాన్లు 200 వాట్లు, ఒక ఐరన్ బాక్స్ 750వాట్లతో మొత్తం ఒక కిలోవాట్ దాటిపోతుంది. ఇలా అదనపు లోడును విద్యుత్ వినియోగదారులు క్రమబద్దీకరించుకోవాల్సి ఉంటుంది. అదనపు లోడు క్రమబద్దీకరణకు 2019 ఫిబ్రవరి నుంచి జులై వరకు ఎస్‌పీడీసీఎల్ పరిధిలో రాయితీ కల్పించారు. ఒక్కో కిలోవాట్ అదనపు లోడు క్రమబద్దీకరణకు రూ.1,425 చెల్లించాల్సి ఉండగా, 50శాతం రాయితీతో రూ.825 చెల్లిస్తే చాలని ఆఫర్ ఇచ్చారు. ఆ సమయంలో కేవలం 16 వేల మంది మాత్రమే లబ్ధి పొందారు. ప్రస్తుతం రాయితీ లేకపోవడంతో పూర్తి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇళ్లకు కరెంట్ చార్జీల వసూలు..
యూనిట్లు పాత టారిఫ్ కొత్త టారిఫ్
0-50 రూ.1.45 రూ.1.95
51-100 రూ.2.60 రూ.3.10
వంద యూనిట్లకు పైగా వాడితే..
0-100 రూ.3.30 రూ.3.40
101-200 రూ.4.30 రూ.4.80
రెండు వందల యూనిట్లకు పైగా వాడితే..
0-200 రూ.5.00 రూ.5.10
201-300 రూ.7.20 రూ.7.70
301-400 రూ.8.50 రూ.9.00
401-800 రూ.9.00 రూ.9.50
800పైగా రూ.9.50 రూ.10.00
పరిశ్రమలు, కమర్షియల్‌కు చార్జీల వసూలు..
0-50 రూ.6.00 రూ.7.00
0-100 రూ.7.50 రూ.8.50
100-300 రూ.8.90 రూ.9.90
500 పైగా రూ.12.00 రూ.13.00
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..