న్యూఢిల్లీ : ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. అమృత కాలంలో దేశ స్థితిగతులను మార్చే కీలక నిర్ణయాలకు ఈ కొత్త ప్రజాస్వామ్య మందిరం వేదిక కానుంది. దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం సరికొత్త ఘట్టానికి వేదిక కానుంది. దేశానికి పునర్వైభవం తెచ్చే అమృత కాలంలో 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలకు ప్రతీకగా నిలవనున్న కొత్త ప్రజాస్వామ్య మందిరంలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్‌సభ, మధ్యాహ్నం 2.15 గంటలకు రాజ్యసభ సమావేశాలు మొదలుకానున్నాయి.
టైం అయిపోతే.. మైక్ కట్..
కొత్త పార్లమెంట్ భవనంలో మైక్‌లన్నీ ఆటోమేటిక్ వ్యవస్థ సాయంతో పనిచేస్తాయని సమాచారం. సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్ కేటాయించిన సమయం పూర్తి కాగానే మైక్రోఫోన్ ఆటోమెటిక్గా స్విచ్ఛాప్ అవుతుంది. సభలో తమకు మైక్ ఇవ్వట్లేదంటూ ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆటోమేటిక్ మైక్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలపై హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదికపై విచారణ జరగాలని గత సమావేశాల్లో ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. తమ వాణి వినిపించకుండా ప్రభుత్వం మైక్ కట్ చేస్తోందని ఆరోపించారు. అలాగే ప్రతిపక్ష నేతలు మాట్లాడటానికి లేచిన సమయంలో పార్లమెంట్‌లో మైక్‌లు సరిగా పనిచేయవని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కూడా తనకు మైక్ ఇవ్వకుండా ప్రభుత్వం అవమానించిందని ఆరోపించారు. ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసనలు తెలపడానికి వీలులేకుండా ఆ ప్రాంతాన్ని బాగా కుదించినట్లు తెలుస్తోంది.
కాగితాలు వాడరిక..
దీంతో పాటు కొత్త పార్లమెంటు భవనంలో కాగితరహిత కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ప్రతి ఎంపీకి ఓ ట్యాబ్ ఇస్తారు. అందులోనే సభ నిర్వహణ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా జర్నలిస్టులకు కూడా ప్రవేశ నిబంధనలు కఠినతరం చేశారు.
అలా చేస్తే ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది : ఖర్గే
మరోవైపు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. అసెంబ్లీ, లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు 2010లో రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. పలు కారణాలతో ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించలేదు. ఈ డిమాండ్ చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉంది. ఈ అంశాన్ని ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఖర్గే రాజ్యసభలో ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలని మేము గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నాం. మహిళలకు దక్కాల్సినవి అన్ని వారికి దక్కాలని మేమంతా కోరుకుంటున్నాం. ఇందుకోసం సుదీర్ఘంగా కృషి చేస్తున్నాం. ఉభయ సభల్లో మహిళా ఎంపీలు 14 శాతమే ఉన్నారు. శాసనసభల్లో వారి ప్రాతినిధ్యం 10 శాతమే. అమెరికా పార్లమెంట్ లో 2 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది. బ్రిటన్ లో 3 శాతం నుంచి 33 శాతానికి చేరిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ లేవనెత్తాలని మేమంతా విజ్ఞప్తి చేస్తున్నామని ఖర్గే అన్నారు. ప్రభుత్వం కచ్చితంగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ అభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తుందని మేం నమ్ముతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యను ఎత్తిచూపుతూ దేశంలో 8 కోట్ల మంది చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారన్నారు. ఇలా నిరుద్యోగం పెరుగుతూ పోతుంటే దేశంలో ప్రజాస్వామ్యం నాశనం అవుతుందన్నారు.
ప్రజా సమస్యలపై చర్చకు విపక్షాల డిమాండ్
ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రజాసమస్యలపై చర్యలకు విపక్షాలు డిమాండ్ చేశాయి. సోమవారం ఉదయం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో పార్టీల మధ్య సమన్వయాన్ని కొనసాగించాలని, ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపుర్ హింస, సరిహద్దులో చైనా అతిక్రమణ వంటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించాయి. వీటితో పాటు ఆదానీ వ్యవహారం, రైతుల కష్టాలు, దేశంలో ఆర్థిక పరిస్థితి, కుల గణనకు సంబంధించిన ఆంశాలపై చర్చ చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించాయి. ఇక ప్రత్యేక సమావేశాలపై కేంద్రం ఎజెండా లేకపోవడం వల్ల పైన తెలిపిన అంశాలను ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.