Monday, November 25, 2024

నాసికా టీకా రూ.800.. జనవరి ఆఖరు నాటికి మార్కెట్లోకి విడుదల

దేశీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన నాసల్‌టీకా త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్నది. 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోసుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది. కొవిడ్‌ కొత్త వేరియంట్ల ఆందోళన వేళ, నాసల్‌ టీకా రక్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. త్వరలోనే ప్రైవేటులో అందుబాటులోకి వస్తున్న ఈ టీకా ధరను భారత్‌ బయోటెక్‌ సంస్థ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. సింగిల్‌ డోసు టీకాను రూ.800 (పన్నులు అదనం)కే అందిస్తున్నట్లు తెలిపింది. భారీ స్థాయిలో సేకరించే కేంద్ర, రాత్రం ప్రభుత్వాలకు మాత్రం రూ.325కే టీకాను ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇంకొవాక్‌ పేరుతో లభ్యమయ్యే ఈ టీకా కొవిన్‌యాప్‌ ద్వారా అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.


జనవరి నాలుగో వారంలో మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకొవాక్‌ నాసికా టీకాను బూస్టర్‌గా పొందొచ్చు. ప్రస్తుతానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే ముక్కు ద్వారా తీసుకునే ఈటీకా అందుబాటులో ఉంటుంది. జాతీయ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. బీబీవీ 154గా పిలిచే ఈనాసికా టీకా ఇంకొవాక్‌ బ్రాండ్‌ పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. కరోనాపై పోరులో ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షలో తేలింది. ప్రపంచంలో రెండు డోసుల్లో ముక్కుద్వారా తీసుకునే మొట్టమొదటి ప్రాథమిక టీకా కూడా ఇదేనని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement