Wednesday, November 20, 2024

భూమిపై నీటిని పీల్చుకుంటున్న చంద్రుడు..

చంద్ర మండలం మీద స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి మనిషి కలలు కంటుంటే… ఆ మనిషి తయారు చేసిన యంత్రాలు చంద్రుడి మీద అందుకు గల అవకాశాలను అన్వేషిస్తున్నాయి. చంద్రుడి మీద నీటి జాడలు కనుగొని మన చంద్రయాన్‌ అప్పట్లో సంచలనం సృష్టించింది. 2008లో ఇస్రో ఈ రహస్యాన్ని ఛేదించగా… ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందన్న రహస్యం 14 ఏళ్ల తరువాత ఇప్పుడు బట్టబయలు అయింది. ఆ నీరు భూమి నుంచే వెళ్లిందని అలస్కా యూనివర్సిటీకి చెందిన ఫెయిర్‌బ్యాంక్స్‌ జియోఫిజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ సైంటిస్టులు జరిపిన పరిశోధనలలో తేలింది. భూమి ఎగువ వాతావరణం నుంచి హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ ఐయాన్‌లు తప్పించుకొని చంద్రుడిని చేరుకొన్నాయని వీరి పరిశోధనలో తేలింది. చంద్రుడి ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద కనిపించిన నీటి జాడలకు ఆధార వనరులేమిటి అన్న దానిపై ఈ సంస్థ విస్తృతంగా పరిశోధనలు జరిపింది. వాయు రహితమైన చంద్రుడిపై నీటి వనరులు కనుగొనడంతో అమెరికా, యూరప్‌, చైనాలు తమ అంతరిక్ష ప్రయోగాలకు దానిని కీలకస్థావరంగా మార్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

ముఖ్యంగా అంగారక గ్రహానికి వెళ్లటప్పుడు దానిని ఓ విడిదిగా ఉపయోగిం చుకోవాలని భావిస్తున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంలో బేస్‌ క్యాంప్‌ నిర్మించాలని నాసా భావిస్తున్నది. అక్కడి నీటి ఐయాన్‌లను వ్యోమగాముల అవసరాలకు ఉపయోగిం చాలని యోచిస్తున్నది. భూమి ఉపరితలం నుంచి వెళ్లిన ఐయాన్‌లతో 3,500 చదరపు కిలోమీటర్ల మేర చంద్రుడి గర్భంలో నీటి నిల్వలు ఏర్పడ్డాయని అలస్కా యూనివర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. ఇది కనీస స్థాయి అని అనుకుంటున్నారు. ఇంతకన్నా ఎక్కువే ఉండవచ్చ నన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిశోధన ఫలితాలను సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ అనే జర్నల్‌ ప్రచురించారు. భూగోళం చుట్టూ చంద్రుడు పరిభ్రమించే సమయంలో నెలలో కనీసం ఐదు రోజులు చంద్రుడు భూమి మాగ్నటోస్పియర్‌ (అయస్కాంతావరణం… సౌరగాలుల పీడనం కారణంగా సూర్యుడికి అభిముఖంగా (పగటి వైపున) ఉన్న అయస్కాంతావరణం సంకోచించి, సూర్యుడికి అవతలివైపు (రాత్రి వైపున) పొడవుగా, ఒక తోకలాగా విస్తరించి ఉంటుంది) అంచుల్లోకి వస్తాడని, అప్పుడు ఈ హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ ఐయాన్‌లు చంద్రుడి వాతావరణంలోకి ప్రవేశించి ఉంటాయని ఈ పరిశోధనలలో తేలింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement