అనంతం విశ్వంలో వేలాది పాలపుంతలున్నాయి. కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, తోకచుక్కలు.. కృష్ణ బిలాలు… ఒకటేమిటి.. అనంతకోటి రహస్యాల పుట్టలు ఈ పాలపుంతలు. మిరుమిట్లు గొలిపే నక్షత్రాల సమూహం.. విభ్రమపరిచే వాతావరణం కనువిందు చేస్తాయి. అయితే మన కంటికి కనిపించే దృశ్యాలు వేరు. నిపుణులైన ఖగోళ ఫోటోగ్రాఫర్ల చిత్రీకరించే దృశ్యాలు వేరు. ప్రపంచవ్యాప్తంగా అలాంటి నిపుణులైన ఫొటోగ్రాఫర్లు తీసే ఛాయాచిత్రాల్లో అరుదైన, అద్భుతమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు ఇవ్వడం ఓ సంప్రదాయం.
ఈసారి నిర్వహించిన యాన్యువల్ మిల్కీవే ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పేరిట నిర్వహించిన పోటీకి 16 దేశాల నుంచి 3వేల ఎంట్రీలు వచ్చాయి. వాటిలో ఫైనల్స్‌కు 25 ఛాయా చిత్రాలను ఎంపిక చేశారు. భూగ్రహంలో మారమూల ఎడారి ప్రాంతాలనుంచి పాలపుంత అందాలను తమ కెమేరాల్లో బంధించారు. సొకోట్రా, మడగాస్కర్, అటకామా, నమీబియా ఎడారుల్లో కాపుకాసి.. రోజుల తరబడి నిరీక్షించి.. అందమైన దృశ్యాలను క్లిక్‌మనిపించారు. ట్రావెల్ ఫోటోగ్రఫీ బ్లాగ్ ఫైనల్స్‌కు ఎంపికైన ఛాయాచిత్రాలను విడుదల చేసింది. కేప్చర్ ద అట్లాస్ సంస్థ ఈ పోటీ నిర్వహిస్తోంది.