Tuesday, November 26, 2024

Big Story: రూటు మార్చేశారు​.. చేసేవి సిజేరియన్లు, రికార్డుల్లో సాధారణ ప్రసవాలుగా నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు సిజరేయన్‌ ఆపరేషన్లు చేస్తున్న ప్రయివేటు ఆసుపత్రులు రికార్డుల్లో మాత్రం సాధారణ ప్రసవాలుగా చూపుతున్నాయి. సిజేరియన్‌ ఆపరేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంతో ప్రయివేటు ఆసుపత్రులు తమ అక్రమ దందాను రూటుమార్చి కొనసాగిస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల సమాచారం మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రయివేటు ఆసుపత్రులు ఈ విధంగా ఎంతో మంది తల్లలుకు కడుపుకోత ద్వారా ప్రసవాలు చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. ప్రయివేటు ఆసుపత్రులు సాధారణ ప్రసవాలుగా చూపుతున్న తల్లుల ఇంటికి వెళ్లి వైద్య, ఆరోగ్యశాఖ బృందాలు రహస్యంగా సేకరించిన సమాచారంలో ప్రయివేటు ఆసుపత్రుల అక్రమదందా వెలుగులోకి వచ్చింది. పలు ప్రయివేటు ఆసుపత్రులతోపాటు వైద్యులు కమిషన్లు తీసుకుని మరీ ఈ దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా హరీష్‌రావు బాధ్యతలు చేపట్టాక అవసరం లేకున్నా సీ సెక్షన్‌ ఆపరేషన్లు చేస్తున్న ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు వైద్యులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. సీ సెక్షన్లు చేసే ప్రయివేటు ఆసుపత్రుల అనుమతులు రద్దు చేయడంతోపాటు మరిన్ని శాఖాపరమైన చర్యలకూ ఆదేశించారు. సీ సెక్షన్లు అధికంగా జరుగుతున్న ఉమ్మడి కరీంనగర్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఎంఅండ్‌హెచ్‌వోలతో మంత్రి హరీష్‌రావు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి సిజేరియన్లను కట్టడి చేయాలని ఆదేశించారు. బిడ్డ జన్మించేందుకూ మూహుర్తం నిర్ణయించి మరీ సీ సెక్షన్లు చేపిస్తున్న తల్లిదండ్రులను, పూజారులను కఠినంగా హెచ్చరించారు.

ఈ క్రమంలో ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీ సెక్షన్లు ఆపరేషన్లు జరుగుతున్న పరిస్థితులు, ఎన్ని జరుగుతున్నాయి..?, ఎందుకు చేయాల్సి వచ్చింది..? తదితర అంశాల వారీగా నిఘా ఉంచారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీ సెక్షన్లు తగ్గినప్పటికీ ప్రయివేటు ఆసుపత్రులు మాత్రం డొంక తిరుగుడు రూట్లో ప్రభుత్వానికి దొరకకుండా సిజేరియన్లు చేసి వాటిని సాధారణ ప్రసవాలుగా చూపుతున్నాయి. ప్రతి జిల్లాలో కనీసం 10 నుంచి 20 దాకా ప్రయివేటు ఆసుపత్రులు అడ్డగోలుగా సిజేరియన్లు చేసి ఆ వివరాలను సాధారణ ప్రసవాలుగా నమోదు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది.

సాధరణ ప్రసవం చేస్తే ఆసుపత్రి బిల్లు కనీసం రూ.5వేలు కూడా మించకపోవడం, అదే సిజేరియన్‌ చేస్తే రూ.40వేల దాకా వసూలు చేసే అవకాశాలు ఉండడంతో ప్రయివేటు ఆసుపత్రులు కాన్పు కోసం వచ్చే తల్లుల కడుపుకోతలకే ప్రాధాన్యమిస్తున్నాయి. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రముఖ నగరాల్లోని కొన్ని ఆసుపత్రులైతే ఏకంగా లక్షల్లో సీ సెక్షన్‌ ఆపరేషన్‌ చేసి వసూలు చేస్తున్న సందర్బాలు ఉన్నాయి. గతంలో సాధారణ ప్రసవం ఇబ్బంది అయిన మహిళలకు మాత్రమే సిజేరియన్‌ ఆపరేషన్‌ ద్వారా కాన్పు చేసేవారు. ఒకప్పుడు ఈ ఆపరేషన్‌ సదుపాయం లేక ఎందరో తల్లి బిడ్డలు మరణించే వారు.

అయితే ఇప్పుడు అవే సీజేరియన్‌ ఆపరేషన్లు ఇప్పుడు మహిళల ఆరోగ్యానికి శాపంగా మారుతున్నాయి. అవసరం లేకున్నా చేసే కోతలు నిజంగానే కడుపుకోతగా మారుతున్నాయి. సిజేరియన్‌ ఆపరేషన్లలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉంది. రాష్ట్రంలో జరిగే ప్రసవాల్లో 60.7శాతం సిజేరియన్‌ ఆపరేషన్లే కావడం గమనార్హం. దేశ సిజేరియన్‌ ఆపరేషన్ల సగటు కన్నా ఇది మూడు రెట్లు ఎక్కువ. కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలు సిజేరియన్‌ ఆపరేషన్లలో మిగతా జిల్లాల కన్నా అగ్రస్థానంలో నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement