హైదరాబాద్, ఆంధ్రప్రభ: మానేరు నదీ తీరప్రాంతంలో విరాజిల్లి న ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేశంలో గొప్ప పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. రూ. 420 కోట్లతో మానేరు రివర్స్ ఫ్రెంట్ ప్రాజెక్టు పనులు శరవేగంగా ముందుకు కదులుతున్నాయి. అయితే అభివృద్ది పనుల్లో ఏర్పడిన జాప్యాన్ని సరిదిద్దుతూ మరో రూ. 100కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అభివృద్ధికి కేటాయించింది. అంతర్జాతీయ హంగులతో విదేశీ ఇంజనీర్ల ప్రతిభతో పనులు నిర్వహిస్తున్నారు. శాతవాహన ఏలుబడిలో చరిత్రసృష్టించి తెలుగు జాతి శౌ ర్యాన్ని చాటిచెప్పన కోటిలింగాల కేంద్రంగా విరాజిల్లిన సబ్బినాడు కాలక్రమేణ కరీంనగర్ గా అవతరించింది. తవ్వకాల్లో దొరికిన శాసనాల్లో కోటిలింగాల శాతవాహనుల తొలిరాజధానిగా కీర్తించబడింది. కాకతీయుల పూర్వీకులు ఈ ప్రాంతంనుంచి వచ్చి రాజ్యస్థాపన చేశారు. సబ్బినాడు పేరు 1905 నాటికి ఎలగందుల గా ఆతర్వాత నిజాం ఏలు బడిలో కరీంనగర్ గా ప్రసిద్ది చెందింది.
మానేరు నదీతీరప్రాంతంలో అనేక రాజవంశాలు పాలించి చరిత్ర సృష్టించిన సంఘటనలున్నాయి. శ్రీశైలంలో దొరికిన కాకతీయ రాజులు ప్రోల, ప్రతాప రుద్రుని శాసనాలు ఈ ప్రాంత చరిత్ర కు ప్రామాణికంగా నిలవగా కోటి లింగాల్లో దొరికిన చరిత్ర ఆధారాలతో ప్రాచీన శాతవాహన చరిత్ర తెలుస్తుంది. చాళుక్యుల ప్రాభల్యం ఈ ప్రాంత చరిత్రకు ్తనగిషీలు దిద్దింది. ఈ చరిత్రకు పట్టం కడుతూ మానేరు నదీ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకరంగంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. మానేరు నదికి ఇరువైపుల రెసిడెన్స్, మధ్యలో స్ప్రింగ్ బ్రిడ్జ్, బోట్లు, నదిపరివాహకప్రాంతాల్లో ఉద్యానవనాలతో మానేరు ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం తీర్చి దిద్దుతున్నది. మానేరు రివర్ ఫ్రెంట్ తో కరీంనగర్ రూపురేఖలు మారనున్నాయి.
రూ.420 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు లో భాగంగా పనులు జరుగుతుండగా మరో రూ.100కోట్లు కేటాయించి ప్రభుత్వం పనుల్లో వేగం పెంచింది. మానేరు డ్యాం చుట్టూ 10 కిలోమీటర్ల తీరాన్ని ఇరువైపుల ఆధునీకరిస్తున్నారు. గుజరాత్ లోని సబర్మతీ రివర్స్ ఫ్రెంట్ అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకున్నప్పటికీ అంతకంటే గొప్పగా తీర్చి దిద్దేందుకు ఇంజనీర్లు అహర్నిషలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే నదీ మధ్యలోని తీగల వంతెన పూర్తీ కావడంతో మౌలిక సదుపాయలు, రోడ్ల నిర్మాణం పట్ల పర్యాటక శాఖ దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో నిత్యం జల కళ సంతరించుకునే విధంగా తీర్చి దిద్దుతున్నారు.
నీటిలభ్యతో ఉండటంతో స్పీడ్ బోట్లు,ఇతర రకాల బోట్లతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా పనులు జరుగుతున్నాయి. అలాగే వాటర్ స్పోర్ట్స్ కు వేదికగా మానేరు రివర్ ను తీర్చి దిద్దుతున్నారు. పార్కులు, రిసాట్స్, స్టార్‌హోటళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.140కోట్లతో తీగల వంతెన నిర్మాణ పూర్తి అయింది. డిజిటల్ లైటింగ్, అప్రోచ్ రోడ్ల కోసం మరో 36 కోట్లు ఖర్చుచేస్తున్నారు. లోయర్ మానేరు దిగువ ప్రాంతంలో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే మానేరు నదిమధ్యలో చెక్ డ్యాంలను నిర్మించి నీటిని నిల్వచేసి బోటింగ్ సౌఖర్యాలు కల్పిస్తున్నారు. టూరిస్టులను ఆకట్టుకునే విధంగా రంగు రంగుల వాటర్ ఫౌంటెన్స్, పడవలు, లేజర్ షో, డిజిటల్ లైటింగ్ సిస్టమ్,మ్యూజికల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మానేరుకు రెండువైపుల రక్షణ గోడలను కూడా నిర్మిస్తున్నారు. నలువైపుల జర్మనీ టెక్నాలజీతో 45వేల పిక్సెల్స్ సామర్థ్యంతో భారీ టీవీలను ఏర్పాటు చేస్తున్నారు.
పనుల్లో వేగం పెంచి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నాం..
మనేరు నదీ పర్యాటకప్రాంతంగా తీర్చి దిద్దే కార్యక్రమాలు వేగంగా జరగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ కుమార్ చెప్పారు. కరీంనగర్ ఒక ముఖ్య పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే పనులు జరగుతున్నాయన్నారు. కాళేశ్వరం కూడా కరీంనగర్ లో పార్టుగా ఉండటంతో నీటికొరతలేదని చెప్పారు. అవసరమైతే మానేరులోకి కాళేశ్వరం జలాలను ఎత్తిపోసేందుకు వ్యవస్థ సిద్ధంగా ఉందని చెప్పారు. పరిశుభ్రమైన నీటిలో పడవప్రయాణం ఇక్కడ అనుభూతిగా మారనుందన్నారు. పనుల్లో వేగం పెంచి ప్రారంభానికి సిద్ధం చేసేందుకు ఇంజనీర్లు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.