దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎవరి నోట విన్నా కరోనా సెకండ్ వేవ్ గురించే మాట్లాడుకుంటున్నారు. రోజు రోజుకి పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. కరోనా వైరస్ ను అరికట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రైల్వేస్టేషన్ మాత్రం కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి వస్తే మాత్రం థర్మల్ స్క్రీనింగ్ లో అంబులెన్స్ సౌండ్ చేస్తూ స్టేషన్ మొత్తం అలర్ట్ చేస్తుంది. ఇంతకీ ఆ స్టేషన్ ఎక్కడ అనుకుంటున్నారా !!
అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్లో కరోనా పరీక్షలను అధికారులు పటిష్టంగా నిర్వహిస్తున్నారు. జంక్షన్లోని ప్లాట్ఫారాల్లోకి ప్రయాణికులు ప్రవేశించే ప్రదేశంలో థర్మల్ స్క్రీనింగ్ చేసేందుకు సీసీ కెమెరాతోపాటు టీవీని ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ప్రవేశద్వారం వద్దకు రాగానే కెమెరా వారి శరీర ఉష్ణోగ్రతను రికార్డుచేసి సమాచారాన్ని టీవీకి అందిస్తుంది. ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ అయితే టీవీలో నుంచి శబ్దం వస్తుంది. అక్కడ విధులు నిర్వహించే టికెట్ చెకింగ్ సిబ్బంది అప్రమత్తమై సంబంధిత ప్రయాణికులు స్టేషన్లోకి వెళ్లకుండా వెనక్కి పంపించేస్తున్నారు.
స్టేషన్లో శానిటైజర్ వేయాలని రైల్వే జనరల్ మేనేజరు గజానన్ మాల్య ఆదేశించడంతో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాతనే ప్రయాణికులు రైళ్లు ఎక్కేలా చూస్తున్నామని సిబ్బంది తెలిపారు.