Saturday, November 23, 2024

ఆర్‌ అండ్‌ డీపై అతి తక్కువ ఖర్చు.. ప్రపంచంలో అట్టగుడు స్థానంలో భారత్‌

న్యూఢిల్లి : అత్యంత ముఖ్యమైన పరిశోధనా, అభివృద్ధి( ఆర్‌ అండ్‌ డీ) పై మన దేశం ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చు చేస్తోందని నీతి ఆయోగ్‌ తేల్చింది.ఆర్‌ అండ్‌ డీపై ప్రభుత్వ ఖర్చు (పెట్టుబడులు) పెరగపోగా తగ్గిపోతున్నదని తెలిపింది. 2008-09 సంవత్సరంలో జీడీపీలో ఆర్‌ అండ్‌ డీపై 0.8 శాతం ఖర్చు చేస్తే, 2017-18లో ఇది 0.7 శాతానికి తగ్గిపోయింది. బ్రిక్స్‌ దేశాలలౖౖెన బ్రెజిల్‌ 1.2 శాతం, రష్యా 1.1 శాతం, చైనా 2 శాతం కంటే ఎక్కువ, దక్షిణాఫ్రికా 0.8 శాతం ఆర్‌ అండ్‌ డీపై ఖర్చు చేస్తున్నాయి. వీటితో పోల్చితే మన దేశం అతి తక్కువగా ఖర్చు చేస్తోందని నీతి ఆయోగ్‌ తన నివేదికలో తెలిపింది. ఈ విషయంలో ప్రపంచ సగటు ఖర్చు 1.8 శాతంగా ఉంది. ఇండియన్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2021 నివేదికను గురువారం నాడు నీతి ఆయోగ్‌ విడుదల చేసింది. ప్రపంచలోనే మొత్తం జీడీపీలో ఆర్‌ అండ్‌పై పెడుతున్న సరాసరి ఖర్చు అత్యంత తక్కువగా ఉందని స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం జీడీపిలో ఆర్‌ అండ్‌ డీపై అత్యధికంగా ఖర్చు చేస్తున్నాయి. అమెరికా 2.9 శాతం, స్వీడన్‌ 3.2 శాతం, స్విట్జార్లాండ్‌ 3.4 శాతం ఖర్చు చేస్తున్నాయి.

ప్రపంచంలోనే అత్యధికంగా ఇజ్రాయిల్‌ 4.5 శాతం ఖర్చు చేస్తోంది. పరిశోధనా,అభివృద్ధిపై మన దేశంలో ఎక్కువ ఖర్చు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. తక్కువ ఖర్చు చేసే చాలా దేశాలు వీటిలో ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందన్న అభిప్రాయంతో ఉన్నాయి. మన దేశంలో ఆకలి, పేదరికం, వ్యాధుల నిరోధం వంటి వాటికే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం కూడా ఆర్‌ అండ్‌ డీపై ఎక్కువ ఖర్చు చేయకపోవడానికి కారణమని నీతి ఆయోగ్‌ తెలిపింది. కారణాలు ఏమైనప్పటికీ ఆర్‌ అండ్‌ డిపై అధిక ఖర్చు చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. పరిశోధన, అభివృద్ధి పై ఖర్చ చేయలేని దేశాలు దీర్ఘకాలంలో మానవ వనరులను నిలుపుకోవడం కష్టమవుతుందని స్పష్టం చేసింది. ఆర్‌ అండ్‌ పై తక్కువ ఖర్చు వల్ల ఇన్నోవేటివ్‌ అవకాశాలను కోల్పోతామని, కొత్త వాటి ఆవిష్కరణలు జరగకపోవడం అభివృద్ధిలో వెనుకంజ తప్పదని,దీని వల్ల ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలు పెరుగుతాయని తెలిపింది. అభివృద్ధి ఉన్న చోటుకు మంచి అవకాశాల కోసం, మంచి జీవనం, సౌకర్యాల కోసం మానవ వనరులు తరలిపోతాయని పేర్కొంది. ఇది మేథో వలసకు దారితీస్తుందని, ఫలితంగా దేశాభివృద్ధి కుంటుపడుతుందని నీతి ఆయోగ్‌ హెచ్చరించింది. మనం కోరుకుంటున్న 5 ట్రిలియన్‌ డాలర్ల అర్ధిక వ్యవస్థగా ఎదగాలంటే కనీసం ఆర్‌ అండ్‌ డీపై జీడీపీలో 2 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుందని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. పరిశోధనా, అభివృద్ధిపై ఖర్చు చేయకుండా ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధించలేదని తెలిపింది.

స్థూల వ్యయంలోనూ తక్కువే
ఆర్‌ అండ్‌ డీపై మన దేశం చేస్తున్న స్థూల వ్యయంలోనూ ప్రపంచంలోనే అతి తక్కువగా ఉంది. మన దేశంలో ఇది తలసరి 43 డాలర్లుగా ఉంది. రష్యాలో ఇది 285 డాలర్లు, బ్రెజిల్‌లో 173 డాలర్లు, మలేసియాలో 293 డాలర్లు మన కంటే అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ప్రపంచంలో ఒక్క మెెక్సికో మాత్రమే మన కంటే స్వల్పంగా తక్కవగా ఖర్చు చేస్తోంది. ఆర్‌ అండ్‌ డి పై తక్కువ ఖర్చు వల్ల పరిశోధనా రంగం స్తబ్ధతగా ఉందని పేర్కొంది. మన దేశంలో చాలా కంపెనీలు, చివరకు ఆర్బీఐ కూడా పరిశోధన విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయని నీతి ఆయోగ్‌ ఎత్తి చూపింది. పరిశోధన సరిగా లేకపోవడం వల్లే యూనివ ర్శిటీల్లో బోధిస్తున్నదానికి, పరిశ్రమల రంగానికి వాస్తవంగా అవసరమైన వాటికి మధ్య పొంతన కుదరడంలేదని తెలిపింది. ప్రయివేట్‌ కంపెనీలు, పరిశ్రమలు ఆర్‌ అండ్‌ డీపై ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉందని ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్‌ క్రిష్‌ గోపాలకృష్ణన్‌ సైతం అభిప్రాయపడ్డారని నివేదికలో పేర్కొన్నారు. పరిశోధనలపై మన దేశంలో ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉందని, ప్రస్తుతం జీడీపీలో 0.7 శాతంగా ఉన్న కేటాయింపులు, కనీసంగా 3 శాతానికి పెరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడినట్లు తెలిపింది.
2021లో మన దేశంలోని ఆర్‌ అండ్‌ డి రంగంలోకి 343.64 మిలియన్‌ డాలర్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement