బలగం సినిమా చూసి ఏడవని వారంటూ ఉండరంటే అందులో అతిశయోక్తి లేదు.. ఎందుకంటే అందులో ఉన్న సెంటిమెంట్ సీన్స్ అలాంటివి మరీ.. అసలు గొడవకు కారణం.. నల్లి బొక్కే అని చాలా మంది అభిప్రాయం కూడా.. ఒక్క నల్లి బొక్క కోసం బావ, బావమరిది మధ్య గొడవలు.. ఇదంతా మాకెందుకు అనుకుంటున్నారా.. ఒక్కసారి లుక్కేయండి..
మార్కెట్లో కిలో మటన్ ధర రూ.700-800 వరకు ఉంది. మేక మాంసమే కాదు.. తలకాయ, కాళ్లు రేటు కూడా ఇంచు మించు అంతే ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే చాలు.. మటన్ షాప్‌ల వద్ద జనం గుమిగూడతారు. రేటు ఎక్కువైనా.. ముక్క కోసం.. ఎగబడుతుంటారు. అలాంటిది ఉచితంగా మేక మాంసం దొరికితే ఊరుకుంటారా? అందులోనూ తలకాయ కాళ్ల మాంసం ఉంటే.. వదులుకుంటారా? ఎగబడి మరీ.. పట్టుకెళ్తారు. మెదక్ జిల్లాలో ఇదే జరిగింది.
తూప్రాన్ మండలం నాగులపల్లిలో మేక కాళ్లు, తలకాయలు తరలిస్తున్న లారీ బోల్తా పడింది. అతివేగంతో వెళ్తున్న వాహనం.. అదుపుతప్పి బోల్తా పడటంతో కాళ్లు, తలకాయలు రోడ్డుపై పడిపోయాయి. దీన్ని గమనించిన జనం నల్లిబొక్కల కోసం ఎగబడ్డారు. అందిన కాడికి బస్తాల్లో ఎత్తుకెళ్లారు. అటుగా వస్తున్న వాహనదారులు సైతం తమ వద్ద ఉన్న బ్యాగుల్లో నింపుకుని వెళ్లారు. ఈ రోజు పండగే అన్నట్లుగా ఒక్కొక్కరూ రెండు మూడు బ్యాగుల్లో కాళ్లు, తలకాయలను తీసుకెళ్లారు. ఇగ బావను పిలిచి మరీ రెండు నల్లిబొక్కలు తినిపించాలిరా..! అని కొందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు.